క్రికెట్ ప్రపంచంలో పరుగులే ఇంధనంగా జీవించే క్రికెటర్లు చాలామంది ఉన్నారు. వారు క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. వారు ఆడుతుంటే ప్రేక్షకులు ఆటలో లీనమైపోవాల్సిందే. ఇప్పటివరకు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ తెందూల్కర్ టాప్‌లో ఉన్నాడు. ఇతడు అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించి ఎవరెస్ట్ మాదిరి తన స్థానాన్ని పెంచుకున్నాడు. కుమార సంగక్కర (28,016). రికీ పాంటింగ్ (27, 483) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలోనూ కొందరు వారి బ్యాట్‌కు పనిచెప్పేవారు ఉన్నారు. ప్రస్తుత క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన క్రికెటర్లను చూసుకుంటే విరాట్ కోహ్లీ ముందుంటాడు. అలాంటి క్రికెటర్లలో టాప్-5ని ఓసారి చూద్దాం.
5.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా తరఫున 2009లో అరంగేట్రం చేసిన వార్నర్ విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తన బ్యాటుకు పనిచెబితే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. పాకెట్ డైనమోలా పేలే వార్నర్ మీద బాల్ టాంపరింగ్ మచ్చ కూడా పడింది. తద్వారా ఓ ఏడాది ఆటకు దూరమయ్యాడు. తర్వాత ఇతడి బ్యాటింగ్‌లో పస తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ అదేమీ లేదు.. అదే దూకుడు, అదే బాదుడుతో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇతడు ఇప్పటివరకు ఆసీస్ తరఫున 286 మ్యాచ్‌లాడి 14,718 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి.
4 ఎంఎస్ ధోనీ (ఇండియా)
టీమ్ఇండియాకు విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్నాడు మహేంద్రసింగ్ ధోనీ. జట్టును వన్డే, టీ20 ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపాడు. మెరుపు కీపింగ్‌తో పాటు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో ధోనీ దిట్ట. ప్రస్తుతం బ్యాటింగ్‌లో కాస్త నెమ్మదించిన ఈ 39 ఏళ్ల క్రికెటర్ మళ్లీ మెరుపు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మహీ 538 మ్యాచ్‌లు ఆడాడు. 44.96 సగటుతో 17, 266 పరుగులు సాధించాడు. ఇందులో16 సెంచరీలుు, 108 అర్ధశతకాలు ఉన్నాయి.
3. రాస్ టేలర్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ జట్టులో చాలా కాలం నుంచి స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు టేలర్. ఇతడికి అండర్రేటెట్ క్రికెటర్‌గా పేరుంది. ఈ ఏడాది టెస్టు, టీ20ల్లో తన 100వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఒకే ఒక క్రికెటర్ టేలర్ కావడం విశేషం. దశాబ్ద కాలంగా క్రికెట్ ఆడుతున్న ఇతడు తన దేశం తరఫున అత్యధిక టెస్టు పరుగులు (7.174), వన్డే పరుగులు (8,570) సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తంగా 433 మ్యాచ్‌లాడిన టేలర్ 17,721 పరుగులు సాధించాడు. సగటు 43.64గా ఉంది. ఇందులో 40 సెంచరీలు, 91 అర్ధ సెంచరీలున్నాయి.
2. క్రిస్ గేల్ (వెస్టిండీస్)
ఈ పేరు చెప్పగానే మెరుపు ఇన్నింగ్స్‌లు కళ్లముందు మెదులుతాయి. మైదానంలో బద్ధకంగా కదిలే గేల్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి మాత్రం చెలరేగిపోతాడు. బంతి పడటమే ఆలస్యం బౌండరీ దాటించేస్తాడు. ఇతడు మంచి ఫామ్‌లో ఉన్నాడంటే బౌలర్లకు ఎక్కడ బాల్ వేయాలో అంతుచిక్కదు. 40 ఏళ్ల ఈ క్రికెటర్ ఇంకా తనలో ఆట మిగిలుందని చెబుతుంటాడు. ఇతడు కరీబియన్ జట్టు తరఫున 462 మ్యాచ్‌లు ఆడి 38.79 సగటుతో 19,321 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, 104 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
1.విరాట్ కోహ్లీ (ఇండియా)
ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో రన్ మెషీన్‌గా గుర్తింపు పొందాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఆకలితో ఉన్న పులిలా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. సారిథిగానూ సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఆటలో ఫిట్నెస్ ఎంతో ముఖ్యమంటూ ఎందరికో ఆదర్శంగానూ నిలుస్తున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. తక్కువ కాలంలోనే ఎక్కువ పరుగులు సాధించి లీడింగ్ రన్ స్కోరర్స్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పటివరకు 416 మ్యాచ్‌లాడిన విరాట్ 56.15 సగటుతో 21,901 పరుగులతో దూసుకెళ్తున్నాడు. ఇందులో 70 సెంచరీలు, 104 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నాడు. 31 ఏళ్ల ఈ క్రికెటర్‌కు ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. దీంతో ఇతడు సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.