టీ20 క్రికెట్.. ప్రస్తుతం ప్రతి అభిమానికి ఇష్టమైన ఫార్మాట్. ఓవర్ ఓవర్‌కూ మారిపోయే ఫలితం, మెరుపు ఫీల్డింగ్, బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్, బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడమే ఉద్దేశంగా బౌలింగ్.. ఇలా ప్రతి సన్నివేశం ఓ క్లైమాక్స్‌లా ఉంటుంది. అందుకే ఈ ఫార్మాట్ అందించిన మజా మరేది అందించలేకపోతుంది. ఇందులో సిక్సుల బాదుడూ ఎక్కువే. కొందరు ఆటగాళ్లు అయితే సిక్సుల కోసమే పుట్టారా అన్నట్టుగా ఆడతారు. అందులో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, గప్తిల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు ఇన్ని రోజులు రోహిత్ పేరుమీదుండగా.. గురువారం ఈ రికార్డును అధిగమించాడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఎక్కువ సిక్సులు కొట్టిన టాప్-5 ఆటగాళ్లెవరో చూద్దాం.
మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్)
పరిమిత ఓవర్ల క్రికెట్లో గప్తిల్‌ను ఓ స్టార్ ఆటగాడిగా చెప్పుకోవచ్చు. 2009లో టీ20 అరంగేట్రం చేసిన ఇతడు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. 132 సిక్సులతో రోహిత్ రికార్డును తిరగరాశాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 92 టీ20లు ఆడిన గప్తిల్ 132.90 స్ట్రైక్ రేట్‌తో 2718 పరుగులు సాధించాడు.ఈ ఫార్మాట్లో ఇతడి పేరుమీద రెండు సెంచరీలు ఉన్నాయి.
![Batsmen who hit most sixes in T20I cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10785317_ha-2.jpg)
రోహిత్ శర్మ (భారత్)
రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూసిన అభిమానులు ఇతడికి ముద్దుగా 'హిట్‌మ్యాన్' అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుకు సార్థకం చేకూరుస్తూ ఇతడు ఆడే ఆట ఫ్యాన్స్‌ను ఎప్పుడూ ఉర్రూలూగిస్తుంది. 2007లో టీ20 అరంగేట్రం చేసిన రోహిత్.. మొదట మిడిలార్డర్లో ఆడి తర్వాత ఓపెనర్‌గా బరిలో దిగాడు. ఇప్పటివరకు 100 టీ20లు ఆడిన ఇతడు 127 సిక్సులు బాదాడు. అలాగే ఈ ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు సాధించిన రికార్డుతో పాటు అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా రికార్డులు మూటగట్టుకున్నాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేశాడు.
![Batsmen who hit most sixes in T20I cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10785317_ha-1.jpg)
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ ఈ లిస్టులో నిలవడం గొప్ప విషయమే. 2009లో టీ20 అరంగేట్రం చేసిన మోర్గాన్ ఇప్పటివరకు ఆడిన 94 మ్యాచ్‌ల్లో 113 సిక్సులు బాదాడు. అలాగే భవిష్యత్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించి ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా నిలవాలని భావిస్తున్నాడు మోర్గాన్.
![Batsmen who hit most sixes in T20I cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10785317_ha-4.jpg)
కొలిన్ మున్రో (న్యూజిలాండ్)
ప్రస్తుతం టీ20ల్లో అత్యంత దూకుడైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు మున్రో. సులువుగా బంతిని బౌండరీ దాటించగల నైపుణ్యం ఇతడిని ఈ ఫార్మాట్లో గొప్ప బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దింది. ఇప్పటివరకు ఆడిన 62 మ్యాచ్‌ల్లో 107 సిక్సులు బాదాడీ కివీస్ ఆటగాడు. స్ట్రైక్ రేట్ 156గా ఉంది. అలాగే ఈ ఫార్మాట్లో మూడు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ కూడా మున్రోనే.
![Batsmen who hit most sixes in T20I cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10785317_ha-3.jpg)
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
కరీబియన్ ఆటగాళ్లను అత్యుత్తమ టీ20 క్రికెటర్లుగా పేర్కొనవచ్చు. యూనివర్స్ బాస్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్ అభిమానులకు సుపరిచితమే. ఉన్నచోట నిలుచుని మంచినీళ్లు తాగినంత తేలికగా ఇతడు బంతిని బౌండరీ దాటించగలడు. ఇప్పటివరకు 54 టీ20లు ఆడిన గేల్ 105 సిక్సులతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ఫార్మాట్లో తక్కువ మ్యాచ్‌లు ఆడిన గేల్.. టీ20 ముఖచిత్రాన్ని మార్చిన ఆటగాళ్లలో ముందుంటాడనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఇతడి వయసు 40 దాటుతున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం పవర్ తగ్గలేదు.
![Batsmen who hit most sixes in T20I cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jpg_0101newsroom_1609499805_809.jpg)