భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరభ్ గంగూలీ వారంలోనే డే అండ్ నైట్ టెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించాడు. ఈ ప్రతిపాదనకు 3 సెకండ్లలోనే విరాట్ ఒప్పేసుకున్నాడని దాదా అన్నాడు.
"అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టు ఆడేందుకు వాళ్లు (టీమిండియా) ఎందుకు ఇష్టపడలేదో నాకు అర్థం కావట్లేదు. నేను విరాట్‌తో గంటసేపు సమావేశమయ్యా. మొదట ప్రస్తావన డే అండ్ నైట్ టెస్టు గురించే వచ్చింది. ప్రశ్న అడిగిన 3 సెకండ్లలోపే విరాట్ చేద్దామని అంగీకరించాడు. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్టేడియం ఖాళీ ఉండడం చూసి కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడేమో. టెస్టులకు పూర్వ వైభవం తీసుకురావాలి" -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
ఈ ఏడాది అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టును పింక్ బంతితో ఆడాలని ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు ప్రతిపాదన తీసుకురాగా.. కోహ్లీసేన విముఖత వ్యక్తం చేసింది. అనంతరం వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లోనూ ఈ విషయం ప్రస్తావనకు రాగా అప్పుడు ఆసక్తి చూపలేదు భారత్.
బంగ్లాతో నవంబరు 22 నుంచి 26 వరకు జరగనున్న తొలి టెస్టును డే అండ్ నైట్ నిర్వహించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. ఈ పింక్ బంతి క్రికెట్ మ్యాచ్‌కు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. గత ఏడాది ఆసీస్ - కివీస్ మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగింది.
ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్‌కు మహిళా హాకీ జట్టు అర్హత