యువ బంగ్లా ఆటగాళ్ల 'అతి'
2020, అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి బంగ్లాదేశ్ తొలిసారి ట్రోఫీ అందుకుంది. అయితే మ్యాచ్ గెలిచిన ఆనందంలో బంగ్లా ప్లేయర్లు శ్రుతిమించిన అతి ఉత్సాహం ప్రదర్శించారు. భారత ఆటగాళ్ల వద్దకు వచ్చి గేలి చేస్తూ అనుచిత సంజ్ఞలు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య దాదాపు గొడవకు దిగే పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. దీంతో విజేతగా నిలిచిన బంగ్లా జట్టుపై ప్రశంసలకు బదులుగా విమర్శలు వెల్లువెత్తాయి.
సన్నీ×అనుష్క వివాదం
ఐపీఎల్-2020లో విరాట్ కోహ్లీపై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వైఫల్యంపై సన్నీ మాట్లాడుతూ.. "ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మెరుగవుతానని కోహ్లీకి తెలుసు. లాక్‌డౌన్‌లో ఉండటం వల్ల అనుష్క బౌలింగ్‌లో మాత్రమే అతడు సాధన చేశాడు. అలా చేయడం అతడికి ఉపయోగపడలేదనిపిస్తోంది" అని అన్నాడు. లాక్‌డౌన్‌లో ఇంటి మిద్దె మీద కోహ్లీ, అనుష్క సరదాగా క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను ప్రస్తావిస్తూ గావస్కర్ వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనుష్క శర్మ పేర్కొంది. భర్త ఆట గురించి భార్యపై నిందలు వేస్తూ ఎందుకు మాట్లాడారో వివరిస్తే బాగుంటుందని, ప్రతి క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఆగ్రహించింది. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. అనుష్కను నిందించలేదని, కోహ్లీకి ఆమె బౌలింగ్ చేసిందని మాత్రమే అన్నానని తెలిపాడు. "బౌలింగ్ అని మాత్రమే అన్నా. మరే పదం ఉపయోగించలేదు. లాక్‌డౌన్‌లో విరాట్‌తో సహా ఎవరికీ ప్రాక్టీస్ లేదని చెప్పడమే నా ఉద్దేశం" అని సన్నీ వివరణ ఇచ్చాడు. గావస్కర్ మాటలతో వివాదం సద్దుమణిగింది.
ధోనీ కోపంగా చూశాడని..
ఐపీఎల్‌లో మరో విషయంపై తీవ్రంగా చర్చసాగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని వైడ్‌గా ప్రకటించాలనుకున్న అంపైర్ పాల్ రీఫెల్‌ను.. వికెట్ల వెనక ఉన్న ధోనీ కోపంతో చూశాడు. అది వైడ్ కాదని అర్థం వచ్చేలా తీవ్రతతో చూశాడు. దీంతో అంపైర్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్ల అభిప్రాయాల ఆధారంగా అంపైర్లు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నలు వచ్చాయి. కాగా, దీనిపై హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ స్పందిస్తూ ధోనీకి మద్దతుగా నిలిచాడు. దీనిపై చర్చించాల్సిన అవసరం లేదన్నాడు.
సెలక్షన్ కమిటీపై విమర్శలు
ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గాయం కారణంగా హిట్‌మ్యాన్‌ను తీసుకోలేదని సెలక్షన్ కమిటీ వివరించింది. అయితే జట్టును ప్రకటించిన రోజే రోహిత్ ప్రాక్టీస్ చేయడం వల్ల.. ఎంపిక పారదర్శకంగా జరగలేదని మాజీల నుంచి అభిమానుల వరకు సందేహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయడం వల్ల వివాదం కాస్త సద్దుమణిగింది. మరోవైపు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాత బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ కసిగా ఆడుతూ కోహ్లీని తీవ్రతతో చూడటం దుమారంగా మారింది.
కోహ్లీ-రోహిత్‌కు ఏమైంది?
విరాట్-రోహిత్ మధ్య మాటల్లేవని ఎన్నోరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే రోహిత్ గాయంపై తనకు ఎలాంటి స్పష్టత లేదని, ఆస్ట్రేలియాకు జట్టుతో కలిసి రావట్లేదనే సమాచారం తనకు తెలియదని కోహ్లీ పేర్కొనడం వల్ల.. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వాదనలకు బలం చేకూరింది. ఆసీస్ టెస్టు సిరీస్‌కు ఎంపికైన రోహిత్ టీమ్ఇండియాతో కలిసి కంగారూల గడ్డకు వెళ్లకుండా, వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. ఈ విషయం తనకు తెలియదని కోహ్లీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, పదేళ్లుగా కలిసి ఆడుతున్న వీళ్ల మధ్య ఒకరి గురించి ఒకరు చెప్పుకునే, అడిగే చనువు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్ సమయంలోనూ వాళ్లు మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. కెప్టెన్‌గా సహచర ఆటగాడు ఎలా ఉన్నాడని తెలుసుకునే బాధ్యత కోహ్లీకి లేదా? తన గాయం గురించి కోహ్లీతో రోహిత్ ఎందుకు మాట్లాడలేదు?అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. అంతేగాక కోహ్లీ కెప్టెన్సీపై హిట్‌మ్యాన్ అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌కు ఇవ్వాలని వాదనలు వినిపిస్తున్నాయి.
జడేజా కంకషన్‌పై రచ్చ
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్నర్ చాహల్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం వివాదంగా మారింది. దీనిపై ఆసీస్ జట్టు కోచ్ లాంగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌పై వాగ్వాదానికి దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్ చేస్తున్న జడేజాకు ఆఖరి ఓవర్‌లో బంతి హెల్మెట్‌కు తగలడం వల్ల గాయపడ్డాడు. తర్వాత అతడు తిరిగి మైదానంలోకి రాలేదు. జడ్డూ స్థానంలో చాహల్ బౌలింగ్‌కు వచ్చి మూడు వికెట్లతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే బౌలింగ్ కూడా చేయగలిగే జడేజా స్థానంలో చాహల్ రావడం సరైనదేనని కొందరు భావించగా, మరికొందరు దీన్ని వ్యతిరేకించారు. జడేజా కంకషన్‌కు గురైనప్పుడు ఫిజియో మైదానంలోకి రాలేదని, అంతేగాక బ్యాటింగ్ చేస్తూ జడ్డూ తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడని వాదించారు. కాగా, డిలేయ్‌డ్ కంకషన్‌లో లక్షణాలు వెంటనే బయటపడవని, వైద్యుడు తేల్చిన తర్వాత దీనిపై చర్చలు అవసరం లేదని ఎక్కువమంది మద్దతుగా నిలిచారు.
సమీక్ష అడిగేలోపే తెరపై రిప్లే
ఆస్ట్రేలియా పర్యటనలో మరో వివాదం. మూడో టీ20లో మాథ్యూ వేడ్ ఔట్‌గా కోహ్లీ అంపైర్లను సమీక్ష కోరాడు. అయితే ఆ లోపు రీప్లేను తెరపై ప్రదర్శించారు. దీంతో అంపైర్ సమీక్ష తిరస్కరించాడు. దీనిపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎల్బీ కోసం అప్పీలు చేయాలా? వద్దా? అని నిర్ణీత 15 సెకన్లలోపు మేం చర్చిస్తున్నప్పుడే రీప్లే ప్రదర్శించారని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి తప్పులు చేయరాదని అన్నాడు. దాని వల్ల కీలక మ్యాచ్‌ల్లో భారీ మూల్యం చెల్లాంచాల్సి రావొచ్చని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో అదృష్టవశాత్తు బతికిపోయిన వేడ్.. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సాధారణంగా అంపైర్ నిర్ణయం తర్వాత సమీక్ష కోరడానికి 15 సెకన్ల సమయం ఉంటుంది. ఆ లోపు రివ్యూ కోరాలా? వద్దా? అని ఆటగాళ్లు ఆలోచిస్తారు. కానీ రివ్యూ అడిగిలోపే నిర్వాహకుల పొరపాటుతో తెరపై రిప్లే వచ్చింది.
ఇదీ చూడండి : రెండో టెస్టు కోసం టీమ్ఇండియా ముమ్మర సాధన