న్యూజిలాండ్‌లో సుదీర్ఘ పర్యటననను విజయంతో ప్రారంభించింది టీమిండియా. మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల్లో కివీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది కోహ్లీసేన. మొదటి రెండు టీ20లను ఆక్లాండ్ ఈడెన్ పార్క్‌లో ఆడనుంది. అయితే ఈ మైదానంలో అన్ని కుర్చీలు బూడిద రంగులో ఉంటే ఒక్క కుర్చీ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండి, అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అందుకో కారణం ఉంది.
2015 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్ చేరింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్. ఈ రెండు జట్లు అప్పటివరకు ఫైనల్ చేరలేదు. తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించేందుకు ఇరుజట్లు పోటాపోటిగా తలపడ్డాయి. కానీ ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో చివర్లో విజయం కివీస్‌ను వరించింది.
ఆ సిక్సుకు గుర్తుగా
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు కావాలి. సఫారీ స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ బౌలింగ్. కివీస్ ఆటగాడు గ్రాంట్ ఎల్లియట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మైదానంలో నిశబ్దం అలుముకుంది. ఇరుజట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. కానీ సఫారీ జట్టు ఆశల్ని తుడిచేస్తూ, సిక్సు బాది కివీస్‌కు అపురూప విజయాన్నందించాడు ఎలియట్. ఈ సిక్సు ల్యాండ్ అయిన కుర్చీని ఆకుపచ్చ రంగుతో ఓ జ్ఞాపకంగా మార్చారు. గ్రాంట్ ఎలియట్ కుర్చీగా నామకరణం చేశారు. ఈ కుర్చీ వెనుక ఓ ఫలకం కూడా ఉంటుంది.
ఇవీ చూడండి.. ఈ బ్యాట్స్‌మన్ దురదృష్టం మాములుగా లేదు!