లాక్‌డౌన్ ముగిసిన అనంతర పరిణామాలు దేశానికి అత్యంత కీలకమని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డాడు. కరోనాపై భారత్ చేస్తున్న యుద్ధ ఫలితం ఏప్రిల్ 14 తర్వాత కనిపిస్తుందన్నాడు. అయితే లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించాడు. మహమ్మారిపై చేస్తున్న పోరు నేపథ్యంలో క్రీడా ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. సచిన్‌తో సహా 40 మందికి పైగా క్రీడా ప్రముఖులతో మోదీ మాట్లాడారు. దీనిపై సచిన్ స్పందించాడు.
"లాక్‌డౌన్ తర్వాత కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది కీలక సమయం. కరచాలనం బదులుగా సామాజిక దూరం పాటిస్తూ నమస్తేతో పలకరించాలి. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన సమయమిది. క్రీడల్లో జట్టుగా మ్యాచ్‌ను గెలిచినట్లే.. మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడు దేశమంతా జట్టుగా పోరాడాలి. అయితే, ఏప్రిల్ 14 తర్వాత కూడా కరోనా జాగ్రత్తలు అందరూ తప్పక పాటించాలని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పునరుద్ఘాటించారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సమయంలో వారి అనుభవాలు తెలుసుకోవాలి."
- సచిన్ తెందుల్కర్, భారత మాజీ క్రికెటర్
ఇదీ చదవండి: 'నా కంటే తన బౌలింగ్ బాగుంది.. పెద్ద ఫ్యాన్ అయిపోయా'