ప్రపంచకప్‌లో రసవత్తరమైన మ్యాచ్‌లకు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులకో, స్నేహితులకో టికెట్లు ఉచితంగా అందిస్తుంటారు. అది కూడా మహా అయితే ఏ కొద్ది మ్యాచ్లకో ఈ సాయం చేస్తుంటారు. దోని మాత్రం ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం. తన అభిమాని మహ్మద్ బషీర్‌కు ఎప్పటినుంచో మ్యాచ్ టికెట్లు పంపుతున్నాడు. బషీర్... పాకిస్థానీ కావడం విశేషం.
2011 ప్రపంచకప్‌లో మొహాలీ వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్బంగా ధోనీకి, బషీర్‌కు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధంతోనే బషీర్ షికాగో నుంచి రేపటి మ్యాచ్‌ను వీక్షించేందుకు దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి మాంచెస్టర్ చేరుకున్నాడు.
పాకిస్థాన్‌లో పుట్టినప్పటికీ చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడు తలపడినా భారత్‌కే మద్దతు తెలుపుతుంటాడు ఈ పాకిస్థానీ.
"నేను ఇక్కడుకు గురువారం వచ్చాను. ఆదివారం భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు ఒక్కో టికెట్ కోసం 800-900 పౌండ్లు (దాదాపు రూ. 71,976- రూ. 80,973) చెల్లించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం ఇక్కడి నుంచి షికాగో ప్రయాణించేందుకు సరిపోతుంది. ధోనీకి ధన్యవాదాలు. మ్యాచ్ టికెట్‌కై నాకెలాంటి సమస్యలు లేవు.
ధోనీ ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు కాబట్టి నేను అతడికి ఫోన్ చేయలేదు. కేవలం మెసేజ్ ద్వారానే మహీకి టచ్‌లో ఉన్నాను. చాలా కాలం ముందు నేను ఇక్కడకు వచ్చినప్పుడు టికెట్ పంపుతానని ధోనీ నాకు హామీ ఇచ్చాడు. అతడో గొప్ప వ్యక్తి. ధోనీలా ఇంకెవరైనా నాకోసం ఇలా చేస్తారని నేను అనుకోవట్లేదు. 2011లో మొహాలీ మ్యాచ్ నుంచి మహీ నాకు టికెట్లు పంపిస్తున్నాడు. అందుకే ఈసారి ధోనీకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. మ్యాచ్ అనంతరం అతడికి అది అందజేస్తాను." -మహ్మద్ బషీర్
ధోనీపై అభిమానంతో పాటు తన భార్యది హైదరాబాద్ కావడం వల్ల బషీర్ భారత్‌కే మద్దతిస్తాడు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో బషీర్ వేసుకునే జెర్సీలో భారత్, పాక్ ఇరుదేశాల జెర్సీలు కలిసి ఉంటాయి. అందుకే ఇరుదేశాల మధ్య శాంతికి చిహ్నంగా తనను తాను చెప్పుకుంటాడు.
ఇది చదవండి: WC19: గేల్ కవ్వింపు- రూట్ చిరునవ్వు