దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 202 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది టీమిండియా. ఈ గెలుపుతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో ప్రొటీస్ జట్టుపై అత్యధిక విజయ శాతం కలిగిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. 70 శాతం విజయాలతో(10 టెస్టుల్లో 7 గెలుపులు) ఏ భారత సారథులకు అందని గౌరవం దక్కించుకున్నాడు. మిగతా వారి సారథ్యంలో భారత్.. సఫారీ జట్టుతో 29 టెస్టులు ఆడితే ఏడింటిలో మాత్రమే నెగ్గింది.
ప్రత్యర్థి జట్టు స్కోరు (రెండు ఇన్నింగ్స్‌ల్లో) కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లల్లో రోహిత్ ఐదో స్థానంలో నిలిచాడు.
- 1955-56 సీజన్లో న్యూజిలాండ్‌పై వినోద్ మన్కడ్ ఒక్కడే 231 పరుగులు చేయగా.. ప్రత్యర్థి జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో (209, 219) అతడి కంటే తక్కువ స్కోరుకే ఆలౌటైంది.
- 2003-04 సీజన్లో రాహుల్ ద్రవిడ్ 270 పరుగులతో అదరగొట్టగా.. పాకిస్థాన్ 224, 245 పరుగులకు కుప్పకూలింది.
- 2004-05 సీజన్లో సచిన్ తెందూల్కర్ 248 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 184, 202 పరుగులకే పరిమితమైంది.
- 2017-18 సీజన్లో విరాట్ కోహ్లీ శ్రీలంకపై 243 పరుగులు చేస్తే.. లంక జట్టు 205, 166 పరుగులే చేసింది.
- 2019-20 సీజన్లో దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ 212 పరుగుల చేయగా.. సఫారీ జట్టు 162, 133 పరుగులతోనే సరిపెట్టుకుంది.
దక్షిణాఫ్రికా ఘోర పరాభవాలు..
- 2001-02 సీజన్లో ఇన్నింగ్స్ 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది సఫారీ జట్టు.
- 2005-06 సీజన్లో ఇన్నింగ్స్ 259 పరుగుల తేడాతో ఆసీస్‌పైనే మళ్లీ ఓడింది.
- 1888-89లో ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఓటమి చవిచూసింది సౌతాఫ్రికా. తాజాగా టీమిండియాతోనూ ఇంతే తేడాతో ఓడింది.
- దక్షిణాఫ్రికాను 3 అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఓడించిన జట్లలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా రెండు సార్లు 3-0 తేడాతో ఓడించింది. 2001-02 సీజన్లో ఓ సారి.. 2005-06 సీజన్లో మరోసారి ఆసీస్‌పై పరాజయం పాలైంది సఫారీ జట్టు.