టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి ఏదో ఒక రూపంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవలే జరిగిన బాక్సింగ్ డే టెస్టులో.. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో రాణించి జట్టు విజయంలో తన వంతు సాయం చేశాడు.
ఈ నేపథ్యంలోనే తానెంత విలువైన ఆటగాడో సిడ్నీ టెస్టులో మరోసారి నిరూపించుకున్నాడు. గురువారం 166/2 స్కోరుతో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఇంకెన్ని పరుగులు చేస్తుందోనని ఆందోళన చెందిన వేళ జడేజా ఆదుకున్నాడు. 18 ఓవర్లు బౌలింగ్ చేసి 3 మెయిడిన్లు, 62 పరుగులతో 4 వికెట్లు తీశాడు. చివర్లో శతక వీరుడు స్టీవ్‌స్మిత్(131)ను సైతం రనౌట్ చేసి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోవడం వల్ల వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని స్మిత్ భావించాడు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, బుమ్రా వేసిన 106వ ఓవర్‌లో స్క్వేర్ లెగ్ పాయింట్‌లో షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడ్డూ మెరుపు వేగంతో స్పందించాడు. బంతిని అందుకొని నేరుగా వికెట్లకేసి కొట్టాడు. దాంతో స్మిత్ రనౌటయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కీలక సమయంలో రనౌట్ చేసిన జడేజాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియాపై ఆ ఘనత సాధించిన స్మిత్