ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. పుణె వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ క్రిష్ణ 4, శార్దుల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ 2 వికెట్లతో రాణించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీ సేన.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రాహుల్, కృనాల్ అర్ధ సెంచరీలతో రాణించారు.
ఆరంభంలో దూసుకెళ్లి.. తర్వాత టపాటపా..
అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 251 పరుగులకే చేతులేత్తెసింది. పర్యటక జట్టు ఓపెనర్లు జేసన్ రాయ్(35 బంతుల్లో 46 పరుగులు), జానీ బెయిర్ స్టో(66 బంతుల్లో 94 పరుగులు) తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జంట 10 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. వీరిద్దరి జోరు చూస్తే ఇంగ్లాండ్ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ, ఇన్నింగ్స్ 15వ ఓవర్లో అద్భుతం జరిగింది. బంతి అందుకున్న ప్రసిద్ధ్.. ఓపెనర్ రాయ్ వికెట్‌ను తీసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.
ఆ తర్వాత ఏ దశలోనూ ఇంగ్లాండ్ గెలుపు దిశగా పయనించలేదు. క్రమంగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(30 బంతుల్లో 22) మరోసారి విఫలమయ్యాడు. మొయిన్ అలీ(37 బంతుల్లో 30) కాస్త ఫర్వాలేదనిపించాడు. 14.1 ఓవర్లలో 135 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచిన మోర్గాన్ సేన.. తర్వాత 116 పరుగులకే పది వికెట్లను కోల్పోయింది ఓటమి పాలైంది.
98 పరుగులతో సత్తాచాటిన భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఇదీ చదవండి: సచిన్ సరసన విరాట్.. సొంతగడ్డపై 10వేల రన్స్