ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌లో కొంచెం ఆదరణ తక్కువగా ఉన్న ఈ క్రీడకు ప్రచారం కల్పించేందుకు అంగీకరించాడు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ. ప్రముఖ లాలిగా సాకర్ టోర్నీకి భారత్‌లో హిట్‌మ్యాన్‌ను ప్రచారకర్తగా నియమించింది ఆ టోర్నీ యాజమాన్యం. తద్వారా ఇప్పటివరకు ఈ లీగ్ చరిత్రలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నాన్-ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఘనత సాధించాడీ ఆటగాడు.
ఐపీఎల్ లాంటిది...
2017 నుంచే భారత్‌లో సాకర్ లీగ్ మ్యాచ్‌ల్ని నిర్వహిస్తోంది లాలిగా. ఈ టోర్నీ ద్వారా భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచేందుకు సహకరిస్తానని చెప్పాడు రోహిత్. కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్ బాగా అభివృద్ధి చెందిందని చెప్పిన ఈ స్టార్ క్రికెటర్... ఆటలో పోటీతత్వం పెరిగిందని అభిప్రాయపడ్డాడు.
"ఫుట్‌బాల్‌కు ఇండియాలో ఆదరణ పెరుగుతోంది. ఐఎస్‌ఎల్‌లో మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్ల ఆటకు అభిమానులు క్రమంగా పెరుగుతున్నారు. మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఐఎస్‌ఎల్ యువ ప్లేయర్లకు మంచి వేదికగా నిలిచింది. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాలర్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది".
- రోహిత్ శర్మ, క్రికెటర్
మహీ టాప్‌క్లాస్...
భారత యువ క్రికెటర్లలో చాలామంది ఫుట్‌బాలర్ల కేశాలంకరణను అనుసరించేందుకు వెనుకాడరని అన్నాడు టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్. తాను అభిమానించే ఫుట్‌బాలర్, జట్టు, క్లబ్ ఏంటో చెప్పాడు.
"భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య లాంటి యువ ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ను అనుసరిస్తారు. ఆటగాళ్లను గమనిస్తారు. వారి కేశాలంకరణను అనుకరిస్తారు. టీమిండియాలో చాలామంది సాకర్ బాగా ఆడతారు. మా జట్టులో గ్లాటన్ ఇబ్రహిమోవిచ్ ఉన్నాడు. అతడే ఇషాంత్ శర్మ. ఎంఎస్ ధోనీ అద్భుతమైన పుట్‌బాలర్" అని తెలిపాడు రోహిత్.
ఎప్పట్నుంచో తనకు సాకర్ క్రీడ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్ జినెడిన్ జిదానె ఆటంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. మైదానంలో అతడి ఆటను చూస్తానని చెప్పిన హిట్‌మ్యాన్.... రియల్ మాడ్రిడ్ క్లబ్, స్పెయిన్ జట్టు తన ఫేవరెట్ అని అభిప్రాయపడ్డాడు.