ప్రపంచ క్రికెట్లో తన స్థాయిని పెంచుకొంటూ దూసుకెళ్తున్న కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా... సరికొత్త ప్రణాళికతో 2020కి స్వాగతం పలుకుతోంది. 2019లో గెలుపు-ఓటముల మిశ్రమ రుచి చూసిన భారత జట్టు... ఈ ఏడాదిలో ఘనంగా సత్తా చాటాలని భావిస్తోంది.
కొత్త ఏడాదికి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో ఆహ్వానం పలుకుతోంది కోహ్లీసేన. లంక జట్టుతో తలపడనుంది. దానితో మొదలు.. ఈ ఏడాది మరిన్ని సిరీస్‌లే కాకుండా అక్టోబర్ 18 నుంచి టీ20 ప్రపంచకప్‌తో సందడి చేయనుంది 'మెన్ ఇన్ బ్లూ'.
ఐసీసీలో సభ్యత్వం ఉన్న టాప్-10 జట్లలో వెస్టిండీస్, పాకిస్థాన్ మినహా అన్ని దేశాలతో సిరీస్ ఆడనుంది కోహ్లీ సేన. పసికూన జింబాబ్వేతోనూ సిరీస్ ఆడేందుకు భారత్ మొగ్గుచూపింది. ఈ ఏడాది ఆఖర్లో మాత్రం హోరాహోరీ పోరు జరగనుంది. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇందులో పోటీపడటం విశేషం. వీటితో పాటు కలర్‌ఫుల్ జెర్సీలతో ఐపీఎల్‌లోనూ కనువిందు చేయనున్నారు భారత ఆటగాళ్లు.
షెడ్యూల్ ఇదే....
జనవరి 5 --10, భారత్X శ్రీలంక -- 3 టీ20లు (స్వదేశంలో)
జనవరి 14 --19, భారత్X ఆస్ట్రేలియా -- 3 వన్డేలు (స్వదేశంలో)
జనవరి 24 -- మార్చి 4, భారత్X న్యూజిలాండ్ -- 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు (విదేశంలో)
మార్చి 12 -- మార్చి 18, భారత్X దక్షిణాఫ్రికా -- 3 వన్డేలు (స్వదేశంలో)
జూన్ 26 -- జులై 10, భారత్X శ్రీలంక -- 3 టీ20లు, 3 వన్డేలు (విదేశంలో)
ఆగస్టు 17-- ఆగస్టు 28, భారత్Xజింబాబ్వే -- 3 వన్డేలు (విదేశంలో)
సెప్టెంబర్ -- ఆసియా కప్ టీ20(తేదీలు ప్రకటించాల్సి ఉంది) -- (పాకిస్థాన్/యూఏఈ)
సెప్టెంబర్ 28 -- అక్టోబర్ 16, భారత్Xఇంగ్లాండ్ -- 3 వన్డేలు, 3 టీ20లు (విదేశంలో)అక్టోబర్ 18 -- నవంబర్ 15, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2020 (ఆస్ట్రేలియాలో)
నవంబర్ 23 -- జనవరి 12, భారత్X ఆస్ట్రేలియా 2020/21 -- 4 టెస్టులు, 3 వన్డేలు (విదేశంలో)
పింక్ సిరీస్....
భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లను డే/నైట్ రూపంలో పింక్ బాల్‌తో ఆడాలని కోరుతోంది ఆసీస్ బోర్డు. దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆధిపత్య పోరు కోసం భారత్, ఆసీస్ జట్లు తలపడనున్నాయి.
ఆసియా కప్...
పాకిస్థాన్ వేదికగా సెప్టెంబర్‌లో ఆసియా కప్‌లో 6 దేశాలు తలపడనున్నాయి. ఇందులో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా.. ఆగస్టులో మరో జట్టు ఆసియా కప్ అర్హత టోర్నీలో విజేతగా నిలిచి చేరుతుంది. అయితే ఈ టోర్నీని తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్)ను కోరింది. వేదికతో పాటు తేదీలపైనా ఇంకా స్పష్టత లేదు.
అర్హత పోటీల్లో మొత్తం 16 దేశాలు పోటీపడతాయి. మలేషియా వేదికగా ఈ మ్యాచ్‌లు ఫిబ్రవరి నుంచి జరగనున్నాయి. భూటాన్, చైనా, హాంకాంగ్, మలేషియా, మయన్మార్, నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్, బెహ్రెన్, ఇరాన్, కువైట్, మాల్దీవులు, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉన్నాయి. వీటిలో విజేత టాప్-6లో చేరుతుంది.
మార్చి మధ్యలో ఐపీఎల్...
బీసీసీఐ రూపొందించిన పలు సిరీస్‌ల్లోనే కాకుండా భారత ఆటగాళ్లు విడివిడిగా.. ఐపీఎల్లో ఆడనున్నారు. రంగురంగుల జెర్సీల ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుందని దిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్న కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకకు చెందిన కొందరు ఆటగాళ్లు తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.
ఆసీస్×కివీస్ మధ్య టీ20 సిరీస్ మార్చి 29న, ఇంగ్లాండ్×శ్రీలంక టెస్టు సిరీస్ మార్చి 31న ముగుస్తుంది. కానీ కొన్ని ఫ్రాంఛైజీలు ఏప్రిల్ 1న ఐపీఎల్ ప్రారంభించాలని నిర్వాహకులను కోరుతున్నాయి. స్టార్ ప్లేయర్లు ప్రారంభ మ్యాచ్ నుంచి ఉంటే సీజన్ ఎంతో ఉత్సాహంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.
వచ్చే సీజన్ షెడ్యూల్‌లో ఐపీఎల్ నిర్వాహకులు కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. వారంతపు రోజుల్లో రెండేసి మ్యాచ్‌లను నిర్వహించకుండా ఒక్క మ్యాచ్‌నే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఇటీవల ఈ ఏడాదికి సంబంధించిన ఐపీఎల్ వేలం కూడా పూర్తయింది. ఇందులో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ రికార్డు ధర (రూ.15.5 కోట్లు)కు అమ్ముడుపోయాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.