ఫామ్‌కు ఢోకాలేదు, రికార్డులకు కొదవలేదు, ప్రతిభకు తిరుగులేని యువ వికెట్ కీపర్ సంజు శాంసన్.. తుది జట్టులో చోటు సంపాదించడానికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అతడి కల నెరవేరుస్తూ పుణె వేదికగా లంకతో జరగుతున్న మూడో టీ20లో అవకాశమిచ్చింది టీమిండియా యాజమాన్యం. ఈ మ్యాచ్‌లో నిరూపించుకుంటే తన కెరీర్‌కు చాలా ఉపయోగపడనుంది. దాదాపు 73 టీ20ల తర్వాత సంజుకు మళ్లీ అవకాశం లభించింది.
అద్భుతమైన ఆటతీరు...
బ్యాట్‌తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగలిగే ఈ కేరళ కుర్రాడు గ్లోవ్స్‌తో అద్భుతాలు సృష్టించగలడు. 2015లో నీలిరంగు జెర్సీ ధరించిన అతడు.. తొలిసారి భారత్ తుది జట్టులో బరిలోకి దిగుతున్నాడు. జట్టులో ఎంపికైనా తుదిజట్టులో స్థానం కోసం ఇన్నాళ్లు వేచిచూశాడు. గతేడాది జరిగిన బంగ్లా, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో ఇతడికి చోటు రాలేదు.
>> 2015లో జింబాబ్వేపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన శాంసన్ 73 మ్యాచ్‌ల తర్వాత మళ్లీ నేడు బరిలోకి దిగాడు. భారత జట్టులో అత్యధిక టీ20ల్లో చోటు లభించని ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానంలో ఉమేశ్ యాదవ్(65), దినేశ్ కార్తీక్(56), మహ్మద్ షమి(43), రవీంద్ర జడేజా(33) ఉన్నారు.
>> ఒక జట్టుకు ఎక్కువ టీ20ల్లో చోటు లభించని ఆటగాడిగా ఎమ్ ఉదావతే(73)తో సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాడు శాంసన్. ఇతడి కంటే ముందు జే డెన్లీ(79), ప్లంకెట్(74) ఉన్నారు.
పంత్‌కు పోటీయా..?
సంజు విశ్వనాథ్ శాంసన్.. చాలా రోజులుగా ఈ క్రికెటర్ పేరు వార్తల్లో మార్మోగుతోంది. విజయ్ హజారె ట్రోఫీలో సంచలన ద్విశతకం, భారత్-ఏ తరఫున అద్భుత విజయాలు, పంత్‌కు అసలైన పోటీదారుడు.. అంటూ అతడిపై వార్తలు వెల్లువెత్తాయి. ఇతడి ఆటతీరుపై గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.
రంజీల్లో రికార్డు..
కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులు ఎదుర్కొన్న సంజు.. అండర్-13 కేరళ జట్టు సారథిగా పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. ఆ తర్వాత అండర్-16, అండర్-19 కేరళ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తన బ్యాటింగ్ టెక్నిక్‌తో అందర్నీ ఆకర్షించిన అతడు 2012లో భారత్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. యువ భారత్ ఆసియాకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011లో రంజీ ట్రోఫీ ఆడిన అతడు 2015-16 సీజన్‌లో కేరళ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో కెప్టెన్ అయిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
సంజు తొలి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకుర్, బుమ్రా, చాహల్,సైని టీ20 జట్టులోకి అరంగేట్రం చేయకపోవడం విశేషం.
ఐపీఎల్‌లో మెరుపులు
ఐపీఎల్ 2012 వేలంలో శాంసన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. కానీ, అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. తర్వాతి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్‌లోనే అర్ధశతకం బాది 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఐపీఎల్‌లో అర్ధశతకం సాధించిన పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఈ సీజన్‌లో 206 పరుగులు బాది ఫర్వాలేదనిపించాడు.
>> 2013 ఐపీఎల్ 'బెస్ట్ యంగ్ ప్లేయర్'గా ఎంపికయ్యాడు.
>> 2016లో అతడిని దిల్లీ డేర్‌డెవిల్స్ రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది.
>> 2017లో పుణెపై శతకం బాది 386 పరుగులు సాధించాడు.
2018 ఐపీఎల్ వేలంలో శాంసన్‌ను రాజస్థాన్ తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్‌లో 441 పరుగులతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 12వ సీజన్‌లోనూ శతకంతో చెలరేగి 342 పరుగులు బాదాడు.
ఎన్నోసార్లు నిరాశ...
2014 ఇంగ్లాండ్ పర్యటనకు సంజు శాంసన్ ఎంపికయ్యాడు. 5 వన్డేలు, టీ20 కోసం ధోనీకి బ్యాకప్ కీపర్‌గా అవకాశం దక్కింది. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి తుదిజట్టులో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో కూడా సెలక్టర్లు అతడిని ఎంపికచేశారు. కానీ, అదే పునరావృతం అయ్యింది.
>> 2015 జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు నీలిరంగు జెర్సీ ధరించలేదు. భారత్ తరఫున ఆడాలని ఎంతో కృషి చేస్తూ దేశవాళీ, భారత్-ఎ తరఫున రాణించాడు.
>> 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, యోయో ఫిటెనెస్ టెస్టులో విఫలమవడం వల్ల అవకాశం కోల్పోయాడు. అయినా కుంగిపోకుండా తిరిగి పుంజుకొని అద్భుత ప్రదర్శనతో రాణించాడు.
>> గతేడాది దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన సిరీస్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'ను అందుకున్నాడు. విజయ్ హజారె ట్రోఫీలో గోవాపై ఏకంగా ద్విశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు.
>> 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో అతడు 2,945 పరుగులతో పాటు 71 క్యాచ్‌లు, 7 స్టంప్స్ చేశాడు. 88 లిస్ట్-ఎ మ్యాచుల్లో 2,281 పరుగులు, 12 స్టంప్స్, 92 క్యాచ్‌లు అందుకున్నాడు.