క్రికెట్ సందడితో ప్రతి ఏడాది కళకళలాడేది. ఈసారి కరోనా ప్రభావంతో అది పూర్తిగా దూరమైంది. అభిమానులకు ఉత్సాహం కరవైపోయింది. అయితేనేం బయోబుడగలో ఆటతో తిరిగి సందడి మొదలైంది. ఈ క్రమంలోనే రెట్టింపు ఆనందాన్ని ఇచ్చేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. క్రీడాభిమానుల్లో ఫుల్ జోష్ నింపేందుకు వచ్చే ఏడాదంతా విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది.
ఇందులో భాగంగా 2021లో 14 టెస్టులు, 16 వన్డేలు, 23 టీ20లు ఆడనుంది. ఆసియా కప్(జూన్), ఐసీసీ టీ20 ప్రపంచకప్(అక్టోబర్), ఐపీఎల్ వీటికి మినహాయింపు. ఈ మేరకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసేసిందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారత్-ఇంగ్లాండ్ సిరీస్(జనవరి-మార్చి)
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా.. అది పూర్తవగానే స్వదేశానికి తిరిగొస్తుంది. ఇక్కడ ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టులు, నాలుగు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది.
ఐపీఎల్ 14వ సీజన్(మార్చి-మే)
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లు పూర్తవ్వగానే.. ఐపీఎల్ కోసం భారత ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభిస్తారు. మార్చి చివరి వారం నుంచి మే రెండో వారం వరకు ఈ లీగ్ జరుగుతుంది. ఈ సారి ఎనిమిదితో పాటు అదనంగా మరో జట్టు కూడా రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని గురించి చర్చలు జరుగుతున్నాయి.
శ్రీలంక పర్యటన(జూన్)
ఐపీఎల్ తర్వాత జూన్‌లో శ్రీలంక పర్యటనకు వెళ్తుంది టీమ్ఇండియా. ఇరు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడతాయి. జులై రెండో వారం వరకు ఈ సిరీస్ జరగుతుంది. దీనితో పాటే లంకలోనే జరిగే ఆసియాకప్ కూడా ఆడుతుంది.
జింబాబ్వే(జులై)
ఆసియాకప్ అనంతరం జింబాబ్వే వెళ్లనున్న భారత్.. మూడు వన్డేలు ఆడుతుంది. ఇందులో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, కుర్రాళ్లకు అవకాశమివ్వొచ్చు.
ఇంగ్లాండ్ పర్యటన(జులై-సెప్టెంబర్)
ఐదు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్ కోసం భారత జట్టు జులై ఆఖరులో ఇంగ్లాండ్ వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని ఈ సిరీస్ కోహ్లీసేనకు ఎంతో కీలకం.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో(అక్టోబర్)
మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన సిరీస్‌కు స్వదేశంలో భారత్ ఆతిథ్యమివ్వనుంది.
టీ20 ప్రపంచకప్
దక్షిణాఫ్రికాతో సిరీస్ జరిగిన అనంతరం టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుంది. స్వదేశంలో అక్టోబర్ - నవంబర్ మధ్య ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో విజయం సాధించి పూర్తి పట్టుదలతో ఉంది కోహ్లీసేన.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో
స్వదేశంలో నవంబర్ నుంచి డిసెంబర్ రెండో వారం వరకు న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది భారత జట్టు.
దక్షిణాఫ్రికా పర్యటన
డిసెంబర్ నెల మధ్యలో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది కోహ్లీ సేన. మూడు టెస్టులు, టీ20లు(ఎన్ని మ్యాచులో స్పష్టత లేదు) ఆడుతుంది.
"వరుసగా ఆడటం మన ఆటగాళ్లకు కష్టంగా ఉంటుందని తెలుసు. కానీ ఎఫ్టీపీ కమిట్మెంట్స్ ప్రకారం తప్పదు. మన దగ్గర ప్రతిభ ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారు తమ ప్రతిభను నిరూపించుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా మ్యాచ్‌లు జరిగేముందు ఆటగాళ్లకు విరామం దొరికేలా చూస్తాం. రొటేషన్ పాలసీ అమల్లోకి వస్తుంది."
-బీసీసీఐ అధికారి.
2022 షెడ్యూల్
స్వదేశంలో మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన భారత్-వెస్టిండీస్ సిరీస్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరుగుతుంది. ఫ్రిభవరి నుంచి మార్చి వరకు మూడు టెస్టులు, టీ20(ఎన్ని మ్యాచులో స్పష్టత లేదు) కూడిన సిరీస్‌ను శ్రీలంకతో ఆడుతుంది. మార్చిలో మూడు వన్డేలు కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అనంతరం ఐపీఎల్ కోసం స్వదేశానికి తిరిగి వస్తుంది. మే రెండో వారం వరకు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది బోర్డు. జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. మూడు వన్డేలు, టీ20(ఎన్ని మ్యాచులో స్పష్టత లేదు) ఆడుతుంది. అనంతరం అక్కడి నుంచి ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది.
సెప్టెంబర్‌లో 2022 ఆసియా కప్, అకోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించే ఐసీసీ టీ20ప్రపంచకప్‌లో పాల్గొంటుంది. నవంబరులో రెండు టెస్టులు, మూడు టీ20ల కూడిన సిరీస్ కోసం బంగ్లాదేశ్‌కు పయనమవుతుంది. డిసెంబర్లో స్వదేశంలో నిర్వహించే శ్రీలంకతో జరిగే ఐదు వన్డేలు ఆడుతుంది. ఈ విధంగా 2022 టీమ్ఇండియా షెడ్యూల్ పూర్తవుతుంది.
2023 షెడ్యూల్
జనవరిలో మూడు వన్డేలు, టీ20ల(ఎన్ని మ్యాచులో స్పష్టత లేదు) న్యూజిలాండ్ సిరీస్‌కు భారత్ ఆతిథ్యమిస్తుంది. మళ్లీ స్వదేశంలోనే ఫిబ్రవరిలో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఏప్రిల్, మే నెలలో ఐపీఎల్, అక్టోబర్‌లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంటుంది.
ఇదీ చూడండి :
టీమ్ఇండియా కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్