టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్‌ను తలపిస్తాడని సునీల్ గావస్కర్ అన్నారు. అతడు క్రీజులో నిలిస్తే పరుగులు చేయకుండా ఆపడం చాలా కష్టమన్నారు. మైదానానికి రెండు వైపులా బౌండరీలు బాదేందుకు ఉపయోగించే టెక్నిక్ అద్భుతమని ప్రశంసించారు.
"వివ్ రిచర్డ్స్ క్రీజులో నిలిస్తే ఆపడం చాలా కష్టం. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం అలాగే కనిపిస్తున్నాడు. ఒకే లైన్‌లో ఒకేలా వచ్చే బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌లో బౌండరీ బాదేందుకు పై చేతిని, మిడాన్, మిడాఫ్‌లో తరలించేందుకు కింది చేతిని ఉపయోగిస్తాడు. అందుకే విరాట్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కీర్తిస్తారు. ఎందుకంటే అతడు అచ్చం రిచర్డ్స్‌లా బ్యాటింగ్ చేస్తాడు. గతంలో గుండప్ప విశ్వనాథ్, వీవీఎస్ లక్ష్మణ్ అలా బ్యాటింగ్ చేసేవాళ్లు"
సునీల్ గవాస్కర్, భారత మాజీ కెప్టెన్
అంతకు ముందు ఆసీస్ మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ సైతం రిచర్డ్స్‌తో కోహ్లీ బ్యాటింగ్‌ను పోల్చారు. రిచర్డ్స్ సుదీర్ఘ ఫార్మాట్లో ఆడే క్రికెటింగ్ షాట్లనే పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఉపయోగించి వేగంగా పరుగులు చేసేవాడని పేర్కొన్నారు. కోహ్లీ సైతం టీ20, వన్డే, టెస్టులన్న తేడా లేకుండా సంప్రదాయ షాట్లనే ఎంచుకుంటాడని తెలిపారు. కొత్తతరం షాట్లను ఉపయోగిస్తే లయ దెబ్బతింటుందని విరాట్ తనతో ఓ సందర్భంలో చెప్పాడని ఛాపెల్ గుర్తు చేసుకున్నారు.
2008లో అండర్-19 ప్రపంచకప్ కైవసం చేసుకున్న కోహ్లీ నేరుగా భారత జట్టులో ప్రవేశించాడు. అప్పటి నుంచి అలుపన్నదే ఎరుగక పరుగుల వరద పారిస్తున్నాడు. ఎంతో నిలకడగా ఆడుతూ సచిన్ తెందూల్కర్ ఘనతలను చెరిపేస్తున్నాడు. 86 టెస్టులు, 248 వన్డేలు, 82టీ20లు ఆడిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేలకు పైగా పరుగులు చేశాడు. వంద శతకాల ఘనతకు వేగంగా చేరువ అవుతున్నాడు.