ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసమే ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ వాయిదా వేశారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ ఆరోపించారు. ఆర్థికంగా లాభపడటం కోసమే బోర్డులన్నీ ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నారు. జియో క్రికెట్ చర్చలో వారు మాట్లాడారు.
కరోనా వైరస్ ముప్పుతో ఆస్ట్రేలియా వేదికగా నవంబర్లో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా వేశారు. అంతకుముందే ఆసియా కప్ వాయిదా పడటం వల్ల ఐపీఎల్-2020 నిర్వహించేందుకు బీసీసీఐకి సరైన విండో దొరికింది. పది రోజుల్లోపు ఐపీఎల్ పాలక మండలి సమావేశమై షెడ్యూలుపై చర్చించనుంది.
"శక్తిమంతుడు, శక్తిమంతమైన క్రికెట్ బోర్డు విధానాలను రూపొందిస్తుంది. వారి వల్ల ఇతరులు బాధపడాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్, ఆసియాకప్ ఈ ఏడాది ఆడాల్సింది. అప్పుడు భారత్, పాక్ మ్యాచ్ ఉండేది. కానీ వారలా చేయలేదు. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడవి చెప్పలేను. టీ20 ప్రపంచకప్ జరగదని నేను, రషీద్ ఎప్పట్నుంచో చెబుతున్నాం. ఐపీఎల్‌కు ఏం జరగొద్దు. టీ20 ప్రపంచకప్‌కు ఏమైనా ఫర్వాలేదు. క్రికెట్ నాణ్యత దెబ్బతింటున్నప్పటికీ ఆట నుంచి లక్షల డాలర్లు సంపాదించడమే వారికి ముఖ్యం."
-అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయంతో చాలా బోర్డులు ఆర్థిక స్వప్రయోజనాలు చూసుకున్నాయని రషీద్ అన్నాడు. "భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్ మరేదైనా కానివ్వండి. అన్ని బోర్డులూ ఆర్థిక ప్యాకేజీల కోసమే చూస్తున్నాయి. బీసీసీఐ ఒక్కటే కాదు ఈ వ్యవహారంలో అన్ని బోర్డులూ ఐకమత్యంగానే ఉన్నాయి. ఫిబ్రవరి-మార్చిలో టీ20 ప్రపంచకప్ పెట్టొచ్చు. కానీ పీఎస్‌ఎల్‌కు నష్టం. ఏప్రిల్-మే అయితే ఐపీఎల్‌కు, నవంబర్-డిసెంబర్ అయితే బిగ్‌బాష్‌కు నష్టం. అందుకే ఐసీసీ నిర్ణయంలో అన్ని బోర్డులూ ప్రయోజనం వెతుక్కున్నాయి. ఆసియాకప్ వాయిదాపై గంగూలీ ముందుగానే చెప్పాడంటే అతడికి పాక్ లేదా లంక బోర్డులే చెప్పుండాలి కదా" అని రషీద్ పేర్కొన్నాడు.