నేడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ మైదానంలో రాత్రి 7గంటలకు ప్రారంభం కానుంది. తుది సమరానికి నువ్వా.. నేనా అన్నట్లు తమిళనాడు, బరోడా జట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఆ రెండింటి బలాబలాలు ఓ సారి పరిశీలిస్తే..
ఎదురులేని తమిళనాడు..
దినేష్ కార్తీక్ సారథ్యంలోని తమిళనాడు జట్టు.. గ్రూప్ దశలో అలవోక విజయాలు సాధించింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. క్వార్టర్ ఫైనల్లో షారుక్ , బాబా అపరాజిత్ విజృంభణతో సెమీస్ చేరింది. అరుణ్ కార్తీక్ 89 పరుగులతో చెలరేగి జట్టును వరుసగా రెండోసారి ఫైనల్ చేర్చాడు.
తమిళనాడు ఓపెనర్ జగదీశన్ 350 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మరో ఓపెనర్ హరి నిశాంత్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్ కార్తీక్ పెద్దగా పరుగులేమీ చేయకపోయినా.. మిడిల్ ఆర్డర్లో మంచి సహకారం అందిస్తున్నాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిశోర్(8 వికెట్లు)తో పాటు ఆల్‌రౌండర్ అపరాజిత్, బౌలర్ అశ్విన్‌ల పాత్ర కీలకం కానుంది.
ముచ్చటగా మూడోది సాధిస్తారా?
ఈ టీ20 ఫార్మాట్లో మూడో ట్రోఫీ కోసం కాచుకున్న బరోడా.. అందుకు తగ్గట్లే ఆడుతోంది. జట్టు కెప్టెన్ కేదార్ దేవ్‌ధర్ అద్భుత అర్ధ సెంచరీతో జట్టును ఫైనల్ చేర్చాడు. 397 పరుగులతో అత్యధిక టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మరో వైపు గ్రూప్ దశలో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన బరోడా.. క్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ విష్ణు సోలంకీ అద్భుతమే చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
మరో బ్యాట్స్‌మెన్ కార్తీక్ కాకడే తిరిగి ఫామ్ అందుకోవడం జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చింది. ఆల్‌రౌండర్ బాబాషఫీ పఠాన్ అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ రాణించగలడు.
ఇక అతిత్ శేత్, లుక్మాన్ మెరివాలాలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. సెమీస్‌లో మూడు వికెట్లు పడగొట్టిన మెరివాలా పరుగులు ధారళంగా సమర్పించుకున్నాడు. భార్గవ్ భట్, నినాద్ రత్వా, కార్తీక్ కాకడే స్పిన్ త్రయం మిడిల్ ఓవర్లను సమర్థంగా కట్టడి చేయగలరు.
ఇరు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదీ చూడండి: 'భారత్‌లోనే ఐపీఎల్.. మరో ఆలోచన లేదు'