ఇప్పటికే కరోనా దెబ్బతో కంటికి కునుకు లేకుండా గడుపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా మరో ఎదురుదెబ్బ కొట్టాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నట్లు శనివారం ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ ట్వీట్ చేశాడు. తాజాగా రైనా ఈ సీజన్ నుంచి తప్పుకోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు.
"వ్యక్తిగత కారణాల రిత్యా రైనా భారత్‌కు తిరిగి వెళ్లాడనే చేదు వార్తతో ఈరోజు నిద్రలేచా. ఇప్పుడతడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నా. సురేశ్.. సీఎస్కే నిన్ను కచ్చితంగా మిస్ అవుతుంది. ఆది నుంచి ఈ జట్టుతోనే కలిసి ఉన్నావు. ఎల్లప్పుడూ నువ్వు ఈ జట్టుకు గుండెచప్పుడివి. ఈ టోర్నీకే స్టార్ ఆటగాడివి. నీకోసం ఏదైనా చేస్తాం. నీవు గర్వపడేలా ఈ సీజన్లో ఆడతాం."
-షేన్ వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
అనంతరం తమ జట్టులో కరోనా సోకిన విషయంపై స్పందిస్తూ.. మళ్లీ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం ఆసక్తిగా ఉందన్నాడు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అని, ఇలాంటి మెగా ఈవెంట్‌లో కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పాడు.
ప్రస్తుతం చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడినట్లు బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారంతా ఇప్పుడు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. అలాగే నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పింది.