పంద్రాగస్టున అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా ఆటగాడు సురేశ్ రైనాను ప్రశంసించాడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. జట్టులో ఆడేటప్పుడు రైనా బాగా శ్రమించాడని కొనియాడాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చివర్లో వచ్చినా క్లిష్ట పరిస్థితుల్లో అత్యుత్తమంగా రాణించాడని వెల్లడించాడు. ఫీల్డింగ్ కూడా బాగా చేశాడని తెలిపాడు.
"2004-05లో అరంగేట్రం చేసిన ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లలో రైనా ఒకడు. అండర్-19లో బాగా రాణించాడు. టీమ్ఇండియాలో అతడి పాత్ర ఎంతో ముఖ్యమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంతో సహకారం అందించిన ఇతడు.. ఈ ఫార్మాట్లో జట్టు అందుకున్న విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్, ఛాంఫియన్స్ ట్రోఫీ విజయంలో భాగస్వామయ్యాడు."
-రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
ఐపీఎల్ మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలోనూ టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసి ఉంటే రైనా గణాంకాలు మరింత అద్భుతంగా ఉండేవని అభిప్రాయపడ్డాడు ద్రవిడ్.
"ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సాధారణంగా నాలుగో స్థానంలో రైనా బ్యాటింగ్ చేసేవాడు. టోర్నీ ప్రతి సీజన్లో పరుగుల వరద పారిస్తూ విరాట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. అలానే అంతర్జాతీయ జట్టులోనూ టాపార్డర్‌లో బ్యాటింగ్ అవకాశం ఇచ్చి ఉంటే మరింత అద్భుతంగా రాణించేవాడు."
-రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
2005లో ద్రవిడ్ సారథిగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు రైనా.
ద్రవిడ్ మాటలకు స్పందించిన రైనా.. "నన్ను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. నా చిన్నప్పటి నుంచి మీరే నా స్ఫూర్తి. మీ మార్గదర్శకంలో క్రికెట్ ఆడాలన్న నా కల నిజమైంది. మీ చేతుల మీదుగా నా తొలి వన్డే, టెస్టు క్యాప్ అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేను. మీరెప్పుడు నన్ను మీ సొంత మనిషిలా పరిగణించారు" అని గుర్తు చేసుకున్నాడు.
ఇది చూడండి ఐసీసీ ర్యాంకింగ్స్ : కోహ్లీ అదే జోరు.. బుమ్రా డౌన్