జాతీయ సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల కోసం ఐదుగురు క్రికెటర్లు తుది జాబితాలో నిలిచారు. వీరిలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి కర్ణాటక ద్వయం వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషిలు పోటీపడుతున్నారు.
మంగళవారం.. క్రికెట్ సలహా కమిటీ సభ్యులు మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షా సమావేశమయ్యారు. ఈ చర్చ అనంతరం ఛైర్మన్ పదవి కోసం సునీల్ జోషివైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
మరో ముగ్గురు భారత మాజీ క్రికెటర్లు శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్, మాజీ మీడియం పేసర్ హర్విందర్ సింగ్‌లు ఈ జాబితాలో నిలిచారు. వీళ్లు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నేడు(సోమవారం) జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ఆరంభం కానుంది.
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల పదవీకాలం ముగియడం వల్ల సెలక్షన్ కమిటీలో స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల కోసం మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. చీఫ్ సెలక్టర్ రేసులో అగార్కర్ ముందున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి అతడు కుదించిన జాబితాలోనే లేడు.