కరోనా ప్రభావం కారణంగా క్రికెట్ టోర్నీలు వాయిదా పడగా.. ప్రపంచంలోనే ధనిక లీగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. అయితే సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ టోర్నీని జరపడానికి ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. కానీ భారత్‌లో క్రికెట్ ఆడేందుకు ఈ సమయం అనువైంది కాదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. శ్రీలంక లేదా యూఏఈల్లో ఈ లీగ్ కుదించి జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
"టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే సెప్టెంబర్‌లో శ్రీలంక వేదికగా ఐపీఎల్ జరిగితే బాగుంటుంది. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లకు బదులు 7 మ్యాచ్‌లు ఆడేవిధంగా టోర్నీని కుదించాలి. భారత్‌లో సెప్టెంబర్‌లో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి లంక లేక యూఏఈలో టోర్నీ నిర్వహించాలి."
-సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్ నిర్వహణపైనా సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై ఇప్పటికీ ఐసీసీ ఎటువంటి నిర్ణయం తేల్చుకోలేకపోతుంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే ఈ మెగాటోర్నీ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించవచ్చని బీసీసీఐ భావిస్తోంది.