ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా టెస్టు జట్టు అత్యుత్తమమైందని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. మునపటి కంటే ఇప్పుడున్న బౌలర్ల సామర్థ్యం అద్భుతమని పేర్కొన్నాడు. ఇటీవలే ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గావస్కర్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
"బ్యాలెన్స్, సామర్థ్యం, నైపుణ్యాల పరంగా ప్రస్తుతం ఉన్న భారత టెస్టు జట్టు అత్యుత్తమమైందని నా అభిప్రాయం. ఇంతకంటే మంచి జట్టు గురించి నేను ఆలోచించలేను. బ్యాటింగ్ శైలి చూస్తే.. 1980లో ఉన్న జట్టుకు దగ్గర పోలికలు ఉన్నాయి. అయితే అప్పటి టీమ్‌లో కోహ్లీసేనలో ఉన్న బలమైన బౌలర్లు లేరు. కచ్చితంగా ప్రస్తుత టీమ్ఇండియాలో వైవిధ్యమైన బౌలింగ్ సామర్థ్యం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు."
-సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
కోహ్లీ సారథ్యంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జాబితాలో తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన తొలి విజయం.. టీమ్ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుత భారత టెస్టు జట్టు ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేయగలదని గావస్కర్ తెలిపాడు.
టీమ్ఇండియాలో నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మెన్‌తో పాటు గొప్ప స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లతో జట్టుకు మరింత బలం చేకూరింది.