టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేయడంపై స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్‌తో విజయం సాధించడం బాగుందన్నాడు. భవిష్యత్‌లో కోహ్లీతో ఇలా ఆడటం అనేది ఆరోజు కెప్టెన్ ఆలోచన విధానంపై ఆధారపడుతుందన్నాడు. గత రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో రోహిత్ (64), కోహ్లీ (80నాటౌట్) జంట అనూహ్యంగా ఓపెనింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చడమే కాకుండా.. ఇంగ్లాండ్ బౌలర్లపై దారణంగా విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు పరుగుల వరద పారించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అయితే, ఈ కొత్త కాంబినేషన్ బాగుందని అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పు, కోహ్లీతో ఓపెనింగ్ చేయడంపై హిట్‌మ్యాన్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. "కోహ్లీతో భవిష్యత్‌లో ఇలా కలిసి ఆడటం అనేది విరాట్ ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మేమంతా కలిసి కూర్చొని చర్చించుకోవాలి. జట్టుకు ఏది మంచో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ కోహ్లీ నాతో కలిసి ఆడాలని అనుకుంటే అదే జరగనివ్వండి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. దాంతో తుది జట్టును ఎంపిక చేసి సరైన కాంబినేషన్‌ను రూపొందించాలి. ఇవే ముఖ్యమైన విషయాలు. ఇక కోహ్లీతో ఓపెనింగ్ చేసే విషయంపై ప్రపంచ్‌కప్ సమయంలో ఆలోచిస్తాం. ఇప్పుడే టీ20 సిరీస్ ముగిసింది కాబట్టి.. వన్డేల్లో అతడు నాతో ఓపెనింగ్ చేస్తాడని అనుకోను" అని రోహిత్ వివరించాడు.
టీ20 ప్రపంచకప్‌కు తుది జట్టును ఎంపిక చేయడానికి ఇంకా సమయం ఉందన్నాడు రోహిత్. "పొట్టి ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. అప్పుడు మా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పుడు మాట్లాడటం సరికాదు. ఈ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనింగ్ చేయడం ఒక వ్యూహాత్మక చర్య. ఎందుకంటే తుదిపోరులో ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించి ఇంకో బౌలర్‌ను తీసుకోవాలని నిర్ణయించాం. దురదృష్టం కొద్దీ కేఎల్ రాహుల్‌ను తప్పించాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు యాజమాన్యం అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ ఒక్క మ్యాచ్‌కే అతడిని తప్పించాం. ప్రపంచకప్ దగ్గర పడే సమయానికి పరిస్థితులు మారొచ్చు. రాహుల్ ఎంత కీలకమైన బ్యాట్స్‌మన్ అనేది మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడే ప్రపంచకప్ తుది జట్టు గురించి ఏమీ మాట్లాడలేను. దానికి చాలా సమయం ఉంది" అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: అదరగొట్టిన యువీ- యూసుఫ్.. లంక లక్ష్యం 182