ఆసీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20లో శ్రీలంక పేసర్ కసున్ రజిత చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. ఆడిలైడ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కెరీర్లోనే దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన రజిత...75 పరుగులు ఇచ్చి, టీ20ల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
పొట్టి ఫార్మాట్లో భారీగా పరుగులు సమర్పించుకున్న తునాహన్ తురాన్(టర్కీ) ఆటగాడి రికార్డును అధిగమించాడు. ఇదే ఏడాది ఆగస్టులో చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో తునాహన్.. 70 పరుగులు ఇచ్చాడు.
వార్నర్ దంచేశాడు...
ఈ మ్యాచ్‌లో 56 బంతుల్లో శతకం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇతడి విధ్వంసం దెబ్బకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 233 పరుగులు చేసింది ఆసీస్. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ 64, మ్యాక్స్‌వెల్ 62 పరుగులు చేశారు. స్వదేశంలో జరిగిన టీ20ల్లో కంగారూల అత్యధిక స్కోరు ఇదే. 2007లో సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌పై 221 పరుగులు చేసిందీ జట్టు.
భారీ లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేశారు లంకేయులు. ఫలితంగా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. బ్రిన్బేన్ వేదికగా బుధవారం రెండో టీ20, మెల్బోర్న్లో శుక్రవారం మూడో టీ20 జరగనుంది.