స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన భారత బౌలర్ శ్రీశాంత్.. త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సెప్టెంబరుతో అతడిపై నిషేధం ముగియనున్న నేపథ్యంలో రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే ఇతడిని జట్టులోకి తీసుకోనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. టీమ్ఇండియా తరఫున ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
"ప్రస్తుతం జాతీయ జట్టులో స్థానానికి నేను పోటీపడలేను. కేవలం నా అనుభవాన్ని, సహకారాన్ని అందిచడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నా. ఒకవేళ సెలక్టర్లు నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటే.. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ తరఫున ఆడాలనుంది".
- శ్రీశాంత్, టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్
ఏం జరిగిందంటే?
2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌తో పాటు, రాజస్థాన్ రాయల్స్ జట్టులోని అజిత్ చండిలియా, అంకిత్ చవాన్‌లు అరెస్టు అయ్యారు. అనంతరం కేరళ పేసర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జీవితకాలం నిషేధం విధించింది. దాన్ని పునఃపరిశీలించాలని శ్రీశాంత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ బౌలర్‌పై ఉన్న శిక్షను తగ్గించాలని బీసీసీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు అతడిపై ఉన్న నిషేధాన్ని జీవిత కాలం నుంచి ఏడేళ్లకు బోర్డు కుదించింది. ఆ గడువు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది.
ఇదీ చూడండి... ఐపీఎల్లో వార్నర్‌తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ