భారత పేసర్ శ్రీశాంత్‌కు ఊరట లభించింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో విధించిన జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్. ఈ సస్పెన్షన్ వచ్చే ఏడాది ఆగస్టుతో ముగియనుంది.
సుప్రీం ఆదేశం...
మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రీశాంత్... తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధంపై పునఃపరిశీలించాలని కోరాడు. ఈ అభ్యర్థనను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం... అతడికి విధించిన సస్పెన్షన్‌పై మరోసారి సమీక్ష చేయాలని అంబుడ్స్‌మన్‌కు సూచించింది. ఈ కేసుపై విచారణ చేసిన జస్టిస్ డీకే జైన్... శిక్షా కాలాన్ని ఏడేళ్లకు కుదించినట్లు తెలిపారు. ఇప్పటికే 6 ఏళ్ల బ్యాన్ పూర్తయినట్లు వెల్లడించారు.
" క్రికెట్ నుంచి పూర్తిగా వేటు వేస్తూ... ఏ లీగ్‌ల్లోనూ, జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడకుండా శ్రీశాంత్‌పై గతంలో జీవితకాల నిషేధం పడింది. ఇప్పటికే అతడి కెరీర్ చాలా భాగం కోల్పోయాడు. నిషేధంపై సమీక్ష చేసి తాజాగా ఆ శిక్షను 7 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. 2013 సెప్టెంబరు 13 నుంచి ఈ కాలం లెక్కలోకి తీసుకుంటున్నాం".
--జస్టిస్ డీకే జైన్, బీసీసీఐ అంబుడ్స్‌మన్
2013 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్... స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎక్స్ట్రా పరుగులు ఇచ్చేందుకు 10 లక్షలు లంచం తీసుకున్నట్లు పేర్కొన్న బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ... క్రికెట్ ఆడకుండా అతడిపై జీవితకాలం వేటు వేసింది.