దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తర్వాత తన రీఎంట్రీ గురించి ఆలోచిస్తానని తెలిపాడు.
" ప్రస్తుతానికి నా దృష్టి అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నా సర్వశక్తుల మేరకు పోరాడతా. తర్వాత ఈ ఏడాదిలో ఏంచేయాలనే దాని గురించి ఆలోచిస్తా. ప్రతి ప్లేయర్ తన పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. నా భార్య, ఇద్దరు కుమారుల కోసం సమయాన్ని వెచ్చించే స్థితికి చేరుకున్నాను. క్రికెట్‌కు, కుటుంబానికి మధ్య సమతుల్యత ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజుల్లో ప్రముఖ ఆటగాళ్లకు మానసిక, శారీరక ఒత్తిడి భారీగా ఉంది. అయితే ఏం చేయాలో, ఏం చేయకూడదనేది వారే నిర్ణయించుకోవాలి. ఇలాంటి సమయంలో క్రమశిక్షణ అనేది కీలకంగా ఉంటుంది".
-- ఏబీ డివిలియర్స్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే కరోనా ప్రభావంతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. ఏబీ డివిలియర్స్ 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ తరహా లీగ్‌ల్లో మాత్రమే ఆడుతున్నాడు.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌కు అవసరమైతే అందుబాటులో ఉంటానని మిస్టర్ 360 చెప్పగా సెలక్టర్లు అందుకు అంగీకరించలేదు. అయితే టీ20 ప్రపంచకప్‌కు అతడిని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు కూడా ఏబీ తిరిగి జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.