భారత్ నుంచి స్వదేశానికి చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ (కొవిడ్-19) విజృంభిస్తుండటం వల్ల ఇటీవలె భారత్- దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు. అనంతరం మంగళవారం సఫారీలు తమ దేశానికి చేరుకున్నారు. అయితే 14 రోజుల వరకు వారంతా స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆ జట్టు ప్రధాన వైద్యాధికారరి డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు.
" ఇతరులకు దూరంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆటగాళ్లకు సూచించాం. కుటుంబాన్ని, బంధువులను, ఇతరులను రక్షించుకోవడానికి ఇదే సరైన మార్గమని భావిస్తున్నాం. ఆ సమయంలో ఆటగాళ్లకు కరోనా లక్షణాలు గుర్తించవచ్చు. ప్రయాణంలో కొందరు ఆటగాళ్లు మాస్క్‌లు ధరించగా, మరికొందరు ధరించలేదు. అది వారి వ్యక్తిగతం. అయితే మేం ప్రయాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పర్యటన ముందే కొవిడ్-19 గురించి ఆటగాళ్లకు అవగాహన కల్పించాం. ఆరోగ్య జాగ్రత్తలు వివరించాం. పర్యటన ముగిసినా వైద్యులు వారితో అందుబాటులో ఉంటారు"
-- మంజ్రా, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వైద్యుడు
ధర్మశాల వేదికగా భారత్- దక్షిణాఫ్రికా తొలి వన్డే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఆ తర్వాత కొవిడ్-19 ముప్పుతో సిరీస్‌ను వాయిదా వేసింది బీసీసీఐ. అప్పటికే రెండో వన్డే కోసం లఖ్‌నవూకు చేరుకున్న సఫారీలు దిల్లీ వెళ్లారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో అనుసంధాన విమానం కోసం సోమవారం కోల్‌కతాలో బస చేశారు. మంగళవారం కోల్‌కతా నుంచి దుబాయ్‌కి వెళ్లే విమానం అందుకున్నారు. కరోనా వైరస్ ముప్పు తగ్గిన తర్వాత వాయిదా పడ్డ సిరీస్‌ను మళ్లీ నిర్వహించనున్నారు.