సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా అర్ధశతకంతో అలరించగా.. మిగిలిన ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత అజింక్యా రహానె(117*) శతకం బాదగా.. భారత్ 247/9 పరుగుల స్కోర్ చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం క్రిస్‌గ్రీన్(125*) శతకంతో చెలరేగడం వల్ల ఆస్ట్రేలియా 306/9 పరుగుల స్కోర్ సాధించి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 59 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఈ క్రమంలోనే మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్-ఎ జట్టు ఏ పరిస్థితుల్లో మెరుగ్గా కనిపించలేదు. శుభ్‌మన్ గిల్(29), హనుమ విహారి(28), అజింక్యా రహానె(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో వృద్ధిమాన్ సాహా అర్ధశతకంతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విలువైన స్కోరును అందించాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు ఆట చివరి రోజు ముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టపోయి 52 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.