ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్.. భారత ఆటగాడు చతేశ్వర్ పుజారాను అధిగమించి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విలియమ్సన్ రెండో ర్యాంకులో ఉన్నాడు.
ఏడాది సస్పెన్షన్ తర్వాత ఆడిన టెస్ట్‌లో సత్తాచాటాడు స్టీవ్ స్మిత్. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144, రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులతో చక్కటి ప్రదర్శన చేసి తాజా ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు.
ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 922 పాయింట్లతో మెుదటి స్థానంలో కొనసాగుతుండగా.. విలియమ్సన్ 913, స్మిత్ 900 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అగ్రస్థానంలో కమిన్స్...
బౌలర్ల విభాగంలో ప్యాట్ కమిన్స్ 898 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. యాషెస్ తొలి టెస్టులో ఏడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. గతంలో గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్ బౌలింగ్‌లో మెుదటి స్థానాలు కైవసం చేసుకున్నారు. గత 50 ఏళ్లలో ఈ ఘనత సాధించిన మూడో ఆసీస్ బౌలర్‌గా కమిన్స్ రికార్డుకెక్కాడు.
యాషెస్ తొలి టెస్టులో సత్తాచాటిన ఆటగాళ్లు..
ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ 13 స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్ ఫోక్స్, క్రిస్ వోక్స్ జాబితాలో వరుసగా 69, 70 స్థానాల్లో ఉన్నారు. ఓపెనర్ రోరీ బర్న్స్ 81వ ర్యాంక్‌తో కెరీర్లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 100 టెస్ట్ వికెట్లు పడగొట్టిన ఇంగ్లీష్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 16వ స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల జాబితాలో నాలుగు వికెట్లు పడగొట్టిన వోక్స్ 29 వ స్థానంలో నిలివటమే కాకుండా ఆల్ రౌండర్ల విభాగంలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
ఇదీ చూడండి: 'బాధపడకు... పీవోకేనూ బాగు చేస్తాం'