ఇయాన్ మోర్గాన్ విదేశీ ఆటగాడు కావడం వల్లే కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథిగా దినేశ్ కార్తీక్ కొనసాగుతున్నాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. అలాగే జట్టుకు సారథిగా కార్తీక్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు. అయితే మోర్గాన్ అనుభవాన్ని, సేవలను ఉపయోగించుకోవాలని కార్తీక్‌కు సూచించాడు.
ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన కేకేఆర్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మరో మ్యాచ్‌లో ఓడింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చి ఓటమికి తలవంచింది. ఈ మ్యాచ్‌లో సారథి దినేశ్ కార్తీక్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 228 పరగుల లక్ష్య చేధనలో రాహుల్ త్రిపాఠిని 8వ స్థానంలో పంపించడాన్ని క్రికెట్ నిపుణులు తప్పుబట్టారు. అలాగే గత నాలుగు మ్యాచుల్లో కార్తీక్ వ్యక్తిగతంగా విఫలమయ్యాడు. దీంతో అభిమానులు, విశ్లేషకులు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై వేటు వేసి ఇయాన్ మోర్గాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయాన్ని ఓ అభిమాని బ్రాడ్ హాగ్ ముందు ప్రస్తావించగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విశ్లేషించాడు. 'ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ చేస్తే బాగుంటుంది. అతడు గొప్ప సారథి. అలాంటి ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు అతని నైపుణ్యాలన్నీ వాడుకోవాలి. కానీ దినేశ్ కార్తీక్ కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అతను మోర్గాన్ నైపుణ్యాలు వాడుకుంటే సరిపోతుంది. మోర్గాన్ ఓవర్‌సీస్ ప్లేయర్ కావడం.. ఐపీఎల్‌లో నలుగురికే అవకాశం ఉండటం అతని సారథిగా నియమించడానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే మోర్గాన్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు.. అతను ఫామ్ కోల్పోతే టామ్ బాంటన్‌తో రీప్లేస్ చేయవచ్చు. అదే కెప్టెన్‌గా విఫలమైతే ఏం చేయలేం. అందుకే నేను దినేశ్ కార్తీక్‌నే కెప్టెన్‌గా ఉండాలంటున్నా. అలానే అతడు మోర్గాన్ నైపుణ్యాలను ఉపయోగించుకోవడం మంచిదని భావిస్తున్నా' అని హాగ్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి తెలుగులో విడుదల కానున్న విజయ్ మలయాళ సినిమా