అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి యూఎస్ ఎంబసీ షాక్ ఇచ్చింది. అతడిపై స్వదేశంలో గృహహింస కేసు ఇంకా విచారణలో ఉన్న కారణంగా వీసాను నిరాకరించింది. చివరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి జోక్యంతో అతడికి అనుమతి లభించింది.
షమి.. దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని, అతడిపై ఉన్న కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని లేఖలో రాసి ఎంబసీ మందుంచారు రాహుల్.
"అవును, షమి వీసాను యూఎస్ ఎంబసీ తొలుత నిరాకరించింది. అతడిపై ఉన్న పోలీసు కేసు ఇంకా విచారణలో ఉండటమే కారణం. షమి దేశం తరఫున క్రికెట్లో సాధించిన ఘనతల్ని ఓ లేఖలో రాసి ఎంబసీ ముందుంచారు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం వారికిచ్చారు." -బీసీసీఐ అధికారి.
2018 సంవత్సరంలో షమి భార్య జహాన్.. తనను వేధిస్తున్నాడని అతడిపై ఆరోపణలు చేస్తూ కోల్‌కతాలో కేసు పెట్టింది. ప్రస్తుతం ఇది ఇంకా విచారణలో ఉంది.
ఇది చదవండి: ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌పై హాట్రిక్ సాధించిన మహ్మద్ షమి