టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను మన్కడింగ్ ఉదంతం వదలడం లేదు. గత ఐపీఎల్ సీజన్‌లో బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసిన అశ్విన్.. తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ట్విట్టర్‌లో అభిమానులతో అతను ముచ్చటించగా... "ఆశ్విన్ నువ్వు మళ్లీ మన్కడింగ్ చేస్తే చూడడానికి ఆత్రుతగా ఉన్నా" అని ఓ అభిమాని అన్నాడు. దానికి అశ్విన్ బదులిస్తూ.. "దాని తర్వాత జరిగే పరిణామాలను ఒక్కసారి ఊహించండి" అని అశ్విన్ సమాధానమిచ్చాడు.
"ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి వికెట్ తీయాల్సి వస్తే మన్కడింగ్ చేస్తారా అన్న ప్రశ్నకు గతంలో ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ చేయను. అని సమాధానమిచ్చాడంటూ ఓ అభిమాని గుర్తు చేయగా... "మెక్‌గ్రాత్ దిగ్గజ బౌలర్. అతను చెప్పిన సమాధానాన్ని నేను గౌరవిస్తున్నా. కానీ కేవలం అది మాత్రమే సరైన జవాబు అనుకోవడం మీ తప్పు" అని అశ్విన్ చెప్పాడు. దానికి మరో అభిమాని స్పందిస్తూ.. "న్యాయంగా ఆడడం అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు చేసిన దాన్ని ఎంత ఎక్కువగా సమర్థించుకుంటే అంతలా గౌరవం కోల్పోతావు." అని ట్వీట్ చేశాడు.
"మీరు ఆడాలని కోరుకునే ఒక మ్యాచ్ ఏది." అని మహిళల జట్టు పేసర్ శిఖా పాండే అడిగితే 2001 కోల్‌కతా టెస్టు అని అశ్విన్ జవాబిచ్చాడు. తనకిష్టమైన పంజాబీ ఆహారం చోలే అని, క్రికెట్ క్విజ్ జట్టులో తనతో పాటు సచిన్, పుజారా, జహీర్ ఖాన్ ఉండాలని కోరుకుంటానని అశ్విన్ తెలిపాడు.
ఇదీ చదవండి: 'కోల్‌కతా జట్టు ముందే అతడిని తీసుకోవాల్సింది'