ఆస్ట్రేలియా సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్నా.. టీమ్ఇండియాతో జరగబోయే మూడో టెస్టుకు ఆటంకం రాదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఆరోగ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితిపై అంచనాకు వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. సిడ్నీలో కరోనా కేసులు శుక్రవారం నాటికి 28కి చేరాయి. ఈ నేపథ్యంలో అక్కడ జరగబోయే మూడో టెస్టు నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే స్పందించారు.
"ప్రస్తుతం ఆరోగ్య అధికారులతో చర్చలు జరుపుతున్నాం. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే బయోబబుల్‌ను ఏర్పాటు చేశాం. సిడ్నీలో ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి భయాందోళనలు లేకుండా పర్యవేక్షిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. వారికి అందుబాటులో ఉంటూ ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. మా ఆరోగ్య అధికారులు నిరంతరం శ్రమిస్తూ పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు. ప్రభుత్వ, ఆరోగ్యశాఖతో కలిసి మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. క్రికెట్‌ను సురక్షితంగా నిర్వహించడానికి అదొక మార్గాన్ని చూపుతుంది."
- నిక్ హాక్లే, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ
సిడ్నీలో కరోనా కేసులు పెరిగిన కారణంగా ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్న ఆస్ట్రేలియన్ ఫాక్స్ క్రికెట్ కామెంటేటర్ బ్రెట్ లీ తన ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇతనితో పాటు సిడ్నీకి చెందిన మరో ఇద్దరు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోగా.. మరో ఇద్దరు హోటల్ నుంచి పని చేయడానికి అంగీకారం తెలిపారు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా డిసెంబరు 26న భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: డిన్నర్ బ్రేక్: ఆస్ట్రేలియా 35/2