ఐపీఎల్ 13వ సీజన్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు. అయినా ఐపీఎల్‌పై వ్యాజ్యం వేశారు న్యాయవాది మోహన్ బాబు అగర్వాల్. సత్వర విచారణ జరపాలని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన వెకేషన్ బెంచ్‌ను కోరారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. సెలవులు ముగిశాక మార్చి 16న ఐపీఎల్ వ్యవహారాన్ని రెగులర్ బెంచ్ ముందు ప్రస్తావించాలని సూచించింది.
అనుమానాలే...
మహారాష్ట్ర, కర్ణాటక క్రికెట్ సంఘాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ప్రస్తుతం నిలిపేశాయి. దీంతో ఈ సీజన్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం(మార్చి 14).. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. కరోనా ప్రభావం గురించి చర్చించి, అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్.. ఈ నెల 29 నుంచి మొదలవ్వాలి. తొలి మ్యాచ్ వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు టోర్నీ నిర్వహణపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.