యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్.. ఎడమ చేతి బ్యాట్స్‌మన్ అయిన కారణంగా అతడికి జట్టులో చాలా అవకాశాలు దక్కాయని అభిప్రాయపడ్డాడు సంజూ శాంసన్ కోచ్ బిజూ జార్జ్. అయితే తన శిష్యుడు ప్రతిభను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చుండాల్సిందని అన్నాడు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ మాట్లాడాడు బిజూ.
"సంజూను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు తెలుసు. అతడికి టీమ్ఇండియాలో మరిన్ని అవకాశాలు ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మేనేజ్మెంట్ వైపు నుంచి చూస్తే పంత్‌కు ఎక్కువ ఛాన్స్‌లు ఇచ్చారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అతడు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ కావడం, అలానే లెఫ్టార్మ్ స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్లు ఉన్న జట్లతో ఆడాల్సి ఉండటం మరో కారణం అయ్యుండొచ్చు. ప్రత్యర్థిని ఎదుర్కొనే జట్టేదో కోచ్, కెప్టెన్ నిర్ణయిస్తారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా తప్పించాలని చూడరు" అని బిజూ జార్జ్ అన్నాడు.
2015లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన సంజూ శాంసన్.. తర్వాతి అవకాశం కోసం నాలుగేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై చాలా చర్చే జరిగింది. ఈ జనవరిలో శ్రీలంక సిరీస్‌కు ఎంపికైనా సరే కేవలం 8,2 పరుగులే చేసి నిరాశపరిచాడు సంజూ.
ప్రస్తుతం పంత్, సంజూ జట్టులో లేకపోవడం వల్ల ధోనీ తాత్కాలిక విరామంలో ఉండటం వల్ల కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ చూసుకుంటున్నాడు.