సచిన్ తెందుల్కర్.. ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండడు. తనదైన ఆటతీరుతో ఎన్నో రికార్డుల్ని మాస్టర్ లిఖించుకున్నాడు. మైదానంలో విభిన్న షాట్లతోనూ అలరించాడు. అందులో స్ట్రెయిట్ డ్రైవ్, కట్ షాట్, కవర్ డ్రైవ్‌లు సచిన్‌కు కొట్టిన పిండి. అయితే అతడి బ్యాటు నుంచి జాలువారి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన షాట్లలో అప్పర్ కట్ కూడా ఒకటి. పేసర్లపై ఆధిపత్యం వహించేందుకు ఈ షాట్‌ను ఉపయోగించేవాడు. అసలు ఆ షాట్ ఎందుకు ఆడాల్సి వచ్చిందో ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"2002 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బ్లూమ్‌ఫాంటీన్ వేదికగా జరిగిన టెస్టులో ఆ షాట్ తొలిసారి ఆడా. ఈ మ్యాచ్‌లో మొదట మేం బ్యాటింగ్ చేస్తున్నాం. సఫారీ పేసర్ ఎన్తిని ఆఫ్ స్టంప్ బంతుల్ని ఎక్కువగా వేస్తున్నాడు. సాధారణంగా అతుడు షార్ట్ పిచ్ బంతులు కూడా వేస్తాడు. పిచ్‌లు బౌన్స్‌కు అనుకూలంగా ఉంటాయి. అలాంటి ఎక్కువ ఎత్తులో వచ్చే బంతుల్ని ఆడేందుకు బంతి కింద నుంచి ఆడాలని భావించా. దూకుడుగా ఆడేందుకు ఈ షాట్ ప్రయత్నించేవాడిని. అది చాలా మంది బౌలర్లను ఇబ్బందిపెట్టింది. ఎందుకంటే పేసర్లు డాట్ బాల్ వేయడానికి బౌన్సర్‌ను ఎంచుకుంటారు. కానీ నేను అప్పర్ కట్‌తో బంతిని బౌండరీ దాటించడం వల్ల వారు నిరాశ చెందేవారు"
-సచిన్, టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్
అప్పట్లే సచిన్ ఆడిన షాట్లకు బౌలర్ల వద్ద సమాధానం ఉండేది కాదు. అందుకే చాలామంది మాస్టర్.. క్లాస్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఉండేవారు. దిగ్గజ బౌలర్లపై ఎదురుదాడికే దిగే సచిన్ పోరాట స్ఫూర్తిని మెచ్చుకునేవారు.