ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి 2 నెలలు తాత్కాలిక విరామం తీసుకున్న టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. పారా మిలటరీ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించాడు. వెస్టిండీస్ పర్యటనకు అతడి స్థానంలో రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించిన సెలెక్షన్ కమిటీ.. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం రిషభ్నే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 2020 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని యువ వికెట్ కీపర్‌కే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
"వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కంటే ముందు 22 టీ-ట్వంటీ మ్యాచ్‌లే ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎవరిని ఎంపిక చేయాలో సెలెక్టర్లకు స్పష్టమైన అవగాహన ఉంది" -బీసీసీఐ ప్రతినిధి
ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడిన బీసీసీఐ సీనియర్ ప్రతినిధి.. రాబోయే సఫారీ సిరీస్‌లోనూ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశముందని తెలిపారు.
"రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంపై స్పందించే హక్కు వేరొకరికి లేదు. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో రిషభ్ పంత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలో దిగే అవకాశమూ లేకపోలేదు" -బీసీసీఐ ప్రతినిధి
దక్షిణాఫ్రికాతో 3 టీ20లు ఆడనుంది టీమిండియా. సెప్టెంబరు 15 నుంచి 22 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటిది ధర్మశాలలో, రెండో టీ20 మొహాలీ(సెప్టెంబరు 18), మూడో మ్యాచ్‌కు బెంగళూరు వేదిక కానుంది.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. చివరి మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు పంత్.
ఇది చదవండి: సింధు శిక్షణకు అబ్బురపడిన ఆనంద్ మహీంద్రా