వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ బ్యాటింగ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అలరించేందుకు సిద్ధమయ్యాడీ స్టార్ బ్యాట్స్‌మన్. అయితే, ఫ్రాంచైజీ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్.. రసెల్‌ను ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో దింపే ఆలోచనలో ఉన్నట్లు కేకేఆర్ మెంటార్ డేవిడ్ హస్సీ తెలిపాడు.
గత సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఎంపికైన రసెల్.. తన నిర్ణయాలతో రెండుసార్లు జట్టు ట్రోఫీ కోల్పోయేందుకు కారణమయ్యాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో యూఏఈలో జరిగే లీగ్‌లో అతడిని మూడో స్థానంలో దింపే ఆలోచనలు చేస్తున్నట్లు హస్సీ చెప్పడం ఆసక్తి రేపుతోంది.
"ఒకవేళ ఈ నిర్ణయం సరైనదే అయితే, ఆటలో గెలిచేందుకు జట్టుకు సాయపడుతుంది. అంటే, రసెల్ మూడో స్థానంలో వచ్చి.. 60 బంతులు ఆడితే.. కచ్చితంగా డబుల్ సెంచరీ చేయగలడు. అతని ప్రదర్శనతో మ్యాచ్ ఎలాగైనా మలుపు తిరగొచ్చు."
-డేవిడ్ హస్సీ, కేకేఆర్ మెంటార్
రసెల్ జట్టుకు గుండె చప్పుడు లాంటి వాడని హస్సీ అన్నాడు. అతడు గతేడాది ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో 510 పరుగులు చేశాడు. 11 వికెట్లు కూడా తీశాడు.