వన్డేల్లో మూడు ద్విశతకాలు చేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్టుల్లోనూ తొలి డబుల్ సెంచరీ చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఈ ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో తొలి ద్విశతకం అందుకున్న హిట్ మ్యాన్.. దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.
249 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు రోహిత్. ఇందులో 28 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్‌తో ద్విశతకాన్ని ముగించాడు. వందపరుగులప్పుడూ ఇదే రీతిలో చేశాడు హిట్ మ్యాన్.
39కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు హిట్‌మ్యాన్. జట్టు చేసిన 350 పైచిలుకు స్కోరులో అతడివే 200 పరుగులంటే అతడు ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
అజింక్య రహానేతో(115) కలిసి భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు రోహిత్. వీరిద్దరూ 277 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. రహానే(115) కూడా శతకంతో ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల సహజీవనం తర్వాత నాదల్ పెళ్లి