మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకు అభిమాన దళం ఎక్కువ. అయితే గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత మళ్లీ జట్టులో కనిపించలేదు మహీ. ఫలితంగా అతడి రిటైర్మెంట్పై ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. దీనిపై ధోనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అప్పుడే కొందరు భారత జట్టులో భవిష్యత్ ధోనీ అంటూ కొందరి పేర్లు ప్రకటిస్తున్నారు. అందులో ఇప్పటికే ఎక్కువగా వినపడిన పేరు రిషభ్ పంత్. ధోనీ తర్వాత జట్టులోకి వచ్చినా అనుకున్న స్థాయి ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయాడు. కాగా ప్రస్తుతం ధోనీ వారుసుడిగా ఇంకో పేరు వినిపిస్తోంది.
రియాన్ పరాగ్.. గతేడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన కుర్రాడు. ఈ యువ ఆటగాడి ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్‌ల్లో 127 స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇతడినే ధోనీ భవిష్యత్ వారసుడంటూ చెబుతున్నాడు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.
![రియాన్ పరాగ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7398749_dho.jpg)
"రియాన్ పరాగ్ భవిష్యత్‌పై చాలా ఆసక్తిగా ఉన్నా. ఇతడు భారత జట్టుకు దీర్ఘకాలం సేవలందిస్తాడని అనుకుంటున్నా. మరో ధోనీ లేడా అనే ప్రశ్నకు ఇతడే సమాధానం."
-రాబిన్ ఉతప్ప, టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్
18 ఏళ్ల పరాగ్ 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇప్పటికే ఇతడిపై మరో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా ప్రశంసలు కురిపించాడు. నెట్స్‌లో రియాన్ ప్రాక్టీస్‌ను గమనించానని.. అతడికి మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపాడు.