టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ టెస్టు క్రికెట్‌లో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి చెందిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టుల్లో భారత వికెట్ కీపర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానె(24) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ (89*).. కమిన్స్ వేసిన 58.3వ ఓవర్‌కు రెండు పరుగులు తీసి ఈ ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల మైలురాయి చేరుకున్నాడు. అతడికిది 27వ ఇన్నింగ్స్ కావడం విశేషం. అంతకుముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. పంత్ ఇప్పుడు దాన్ని అధిగమించాడు. ఇక తర్వాతి స్థానాల్లో ఫరూక్ ఇంజినీర్ (36), వృద్ధిమాన్ సాహా (37), నయన్ మోంగియా (39) ఉన్నారు.
2018లో టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు పంత్. అదే సీజన్‌లో ఇంగ్లాండ్ (114), ఆస్ట్రేలియా (159*) పర్యటనల్లో శతకాలు బాదాడు. ఆ అనుభవంతోనే ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికయ్యాడు. మరోవైపు సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ పంత్ 97 పరుగులతో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో తృటిలో శతకం చేజార్చుకున్నా తన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ఆటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. ఇక ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన పంత్ 27 ఇన్నింగ్స్‌ల్లో 2 శతకాలు, 4 అర్ధశతకాలతో కొనసాగుతున్నాడు.
ఇదీ చూడండి: గబ్బాలో 'యువ'గర్జన- టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువ