2019.. క్రికెట్లో కొన్ని సంఘటనలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మరికొన్ని క్రికెట్ ప్రేమికులను నిరాశకు గురిచేశాయి. అనేక అనుభవాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిన కొన్ని మధుర స్మృతులివే. రోహిత్ ఐదు శతకాల నుంచి మలింగ వికెట్ల ప్రదర్శన వరకు ఇందులో ఉన్నాయి. యాషెస్, ప్రపంచకప్‌తో పాటు టీ20ల్లోనూ పలు రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ 20వేల మైలురాయిని అందుకుంటే... మిథాలీ 200 వన్డే మ్యాచ్‌లు ఆడేసింది. వాటి విశేషాలు ఇవిగో...
-
2️⃣0️⃣1️⃣9️⃣ leaves us with unforgettable cricketing memories!
— ICC (@ICC) December 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Which is your favourite?
Watch our 2019 rewind below ⏪ pic.twitter.com/2vXyotmMts
">2️⃣0️⃣1️⃣9️⃣ leaves us with unforgettable cricketing memories!
— ICC (@ICC) December 31, 2019
Which is your favourite?
Watch our 2019 rewind below ⏪ pic.twitter.com/2vXyotmMts2️⃣0️⃣1️⃣9️⃣ leaves us with unforgettable cricketing memories!
— ICC (@ICC) December 31, 2019
Which is your favourite?
Watch our 2019 rewind below ⏪ pic.twitter.com/2vXyotmMts
జనవరి 7
టీమిండియా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. 2019 జనవరి తొలి వారం వరకు కొనసాగిన సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో కంగారూలను చిత్తు చేసింది. వారి సొంత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చారిత్రక విజయం సాధించింది.
జనవరి 26
29 ఏళ్ల కిందట సచిన్ సృష్టించిన రికార్డును ఓ నేపాలీ యువ క్రికెటర్ బద్దలు కొట్టిన రోజు అది. నేపాల్-యూఏఈ మధ్య జరిగిన అంతర్జాతీయ వన్డేలో 16ఏళ్ల రోహిత్ పౌడెల్ 58 బంతుల్లో 55 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన పురుష క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
సచిన్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో.. ఫైసలాబాద్ వేదికగా జరిగిన వన్డేలో అర్ధ సెంచరీ చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు ఛేదించినపుడు రోహిత్ వయసు 16ఏళ్ల 146రోజులు కావడం విశేషం.
జనవరి 28
సింగపూర్ వేదికగా నేపాల్, జింబాబ్వే, సింగపూర్ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో నేపాల్ కెప్టెన్ పరాస్ ఖడ్కా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌లకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అరంగేట్ర టీ20లో శతకం బాదడమే కాకుండా.. లక్ష్య ఛేదనలో టీ20ల్లో శతకం సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పరాస్ ఖడ్కా(106 నాటౌట్; 52 బంతుల్లో 7x4, 9x6) అజేయంగా నిలిచాడు.
ఫిబ్రవరి 1
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్.. 200వ వన్డే పూర్తిచేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్ ఆమెకు 200వ వన్డే. 19 ఏళ్లకే వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయగా.. ఇప్పటి వరకూ 51.33 సగటుతో 6622 పరుగులు చేసింది. టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 263 వన్డేలు ఆడితే అందులో 200 మ్యాచ్‌లకు మిథాలీ సారథిగా వ్యవహరించడం విశేషం.
ఫిబ్రవరి 23
దక్షిణాఫ్రికాలో ఆతిథ్య జట్టుపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్రకెక్కింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ సాధించిన జట్టు శ్రీలంక మాత్రమే.
ఆసియా జట్లు దక్షిణాఫ్రికాలో 18 టెస్టు సిరీస్‌లు ఆడితే.. 16 మ్యాచ్‌ల్లో పరాజయం పొందగా.. 2 సిరీస్‌లు డ్రా అయ్యాయి. లంక ఆడిన ఆరు సిరీస్‌ల్లో ఇదే తొలి విజయం.
ఫిబ్రవరి 24
అఫ్గానిస్థాన్ పొట్టి క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. డెహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 278 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతానికి పొట్టి ఫార్మాట్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 263 పరుగులు చేసింది.
మార్చి 18
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తన తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
మార్చి 23
తొలిసారి 2020 అండర్-19 ప్రంపచకప్‌కు అర్హత సాధించింది నైజీరియా. నమీబియా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ దేశాన్ని 52 పరుగుల తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఉగాండాపై 30 పరుగుల తేడాతో, కెన్యాపై 58 రన్స్ తేడాతో గెలిచి ఈ మెగాటోర్నీకి అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ ప్రపంచకప్ 2020లో జరగనుంది.
ఏప్రిల్ 27
వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో భాగంగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలిసారి ఓ మహిళ అంపైర్‌గా వ్యవహరించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిరే పొలొసాక్ ఈ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా న్యూసౌత్‌వేల్స్ - క్రికెట్ ఆస్ట్రేలియా XI మధ్య సిడ్నీలో జరిగిన పురుషుల వన్డే మ్యాచ్‌కు ఆమె అంపైర్‌గా వ్యవహరించింది.
జూన్ 1
ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల మోత మెగించాడు. ఏకంగా 17 సిక్స్‌లు బాది వన్డే క్రికెట్‌లో సిక్సర్ల రికార్డులో నూతన చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్ నిలిచాడు. అతడి తర్వాత రోహిత్‌శర్మ (16), ఏబీ డివిలియర్స్(16), క్రిస్ గేల్(16) ఉన్నారు.
జూన్ 20
పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది ఉగాండా. మాలితో జరిగిన టీ20 మ్యాచ్‌లో 314 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒక్కే ఒక్క సిక్సర్ ఉండడం విశేషం. క్విబుక విమెన్స్ టీ20 టోర్నమెంటులో ఈ రికార్డు నమోదైంది. అంతర్జాతీయ పురుషుల, మహిళా టీ20 చరిత్రలో ఇదే అత్యధికం.
జూన్ 27
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(417) చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. మొత్తంగా ఈ మైలురాయి అందుకున్న 12వ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ తెందూల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్(24,208) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మన్ కోహ్లీనే కావడం విశేషం.
జులై 6
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగిన ప్రపచంకప్‌లో ఐదు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. భారత జట్టు సెమీస్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు. మాస్టర్ సచిన్, సంగక్కరల పేరుతో ఉన్న నాలుగు శతకాల ప్రపంచకప్ రికార్డును అధిగమించాడు.
జులై 11
ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ 2019 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీశాడు. 10 మ్యాచ్‌ల్లో.. ఈ పేసర్ మొత్తం 27 వికెట్లు పడగొట్టి టాపర్‌గా నిలిచాడు.
జులై 14
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ పెద్ద దుమారం రేపింది. మ్యాచ్ టైగా మారడం వల్ల ఇరుజట్లు సూపర్ ఓవర్ ఆడాయి. అందులోనూ ఇరు జట్ల స్కోరు సమం కావడం వల్ల అధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలిచింది.
ఆగస్టు 1
ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 16 వరకు యాషెస్ సిరీస్ జరిగింది. ఇందులో ఆటగాళ్లు పేర్లు, నంబర్లు ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇలా టెస్టు జెర్సీలపై నంబర్లు కనిపించడం తొలిసారి.
ఆగస్టు 25
యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్(135) శతకంతో అదరగొట్టి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఇంగ్లీష్ జట్టు.
సెప్టెంబర్ 6
న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో ప్రపంచ రికార్డు సృష్టించాడు లంక బౌలర్ లసిత్ మలింగ. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (0), రాస్ టేలర్ (0) ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సార్లు (ట్వీ20, వన్డే) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మలింగ. 2007 వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జట్టుపై నాలుగు వికెట్లు సాధించాడు.
సెప్టెంబర్ 11
ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షూట్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో వరుస బంతుల్లో ముగ్గురిని పెవిలియన్ చేర్చింది. ఆసీస్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందింది.
సెప్టెంబర్ 15
18 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలుచుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలు ఆవిరైపోయాయి. లండన్ ఓవల్ వేదికగా జరిగిన యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. ఆసీస్ ఆటగాడు వేడ్(117) శతకంతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్ 2-2 తేడాతో డ్రా అయింది. గత సీజన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియానే యాషెస్ టైటిల్‌ను కాపాడుకుంది. 774 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు.
అక్టోబర్ 2
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలీసా హేలీ... టీ20 మహిళా క్రికెట్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 148 పరుగులు (19ఫోర్లు, 7సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచింది. అంతకు ముందు ఆసీస్‌కే చెందిన మెగ్ లానింగ్(133) పేరిట ఈ రికార్డు ఉండేది. 46 బంతుల్లోనే 100పరుగులు చేసిన అలీసా టీ20ల్లో వేగంగా శతకం పూర్తి చేసిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగానూ రికార్డులకెక్కింది.
నవంబర్ 10
బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో షఫియుల్, ముస్తాఫిజుర్, అమినుల్ ఇస్లామ్‌ను వరుస బంతుల్లో ఔట్‌చేసిన భారత బౌలర్ దీపక్ చాహర్... హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 7 పరుగులకే 6 వికెట్లు తీసి టీ20 చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
నవంబర్ 22
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్ టెస్టులో.. భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల పేస్ ధాటికి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అసలు ఓటమే ఎరుగని జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.
నవంబర్ 30
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన పోరులో 335 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
డిసెంబర్ 2
టీ20 క్రికెట్లో 3 వికెట్లు తీయడమే ఘనం. అలాంటిది పరుగులేమి ఇవ్వకుండా 6 వికెట్లు తీసింది అంజలి. దక్షిణాసియా క్రీడల్లో భాగంగా మాల్దీవులుతో జరిగిన మహిళల టీ20లో నేపాల్ బౌలర్ అంజలి చండా(6/0) ఈ రికార్డు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
డిసెంబర్ 11
పదేళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను నిర్వహించింది పాకిస్థాన్. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకొంది.
ర్యాంకింగ్స్
ఈ ఏడాదికిగానూ ఐసీసీ చివరిగా విడుదల చేసిన జట్ల ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది భారత్. వన్డేల్లో ఇంగ్లాండ్, టీ20ల్లో పాకిస్థాన్ టాపర్లుగా నిలిచాయి. మహిళలు విభాగంలో టీ20ల్లో, వన్డేల్లో టాప్-1గా ఆస్ట్రేలియా చోటు దక్కించుకుంది.