ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. జట్టు సహాయక బృందంలో ఓ మహిళను నియమించుకుంది. ఈ టోర్నీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆర్సీబీ జట్టు ట్విటర్‌లో గురువారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ వచ్చే సీజన్‌కు నవ్‌నీతా గౌతమ్ అనే మసాజ్ థెరపిస్ట్‌ను నియమించుకున్నామని, ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను ఆమె పర్యవేక్షిస్తారని ట్వీట్ చేసింది. ఓ మహిళను సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా గర్వపడుతున్నామని పేర్కొంది.
ప్రధాన ఫిజియో థెరపిస్ట్ ఇవాన్ స్పీచ్లీ సహాయకురాలిగా నవనీతా కొనసాగనుంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక నైపుణ్య సాధనాలు చేయించడం, ప్రేరణ కలిగించడం, శారీరక గాయాలకు సంబంధించిన చికిత్స అందించడం ఆమె పని.
ఈ విషయంపై మాట్లాడిన ఆర్సీబీ ఛైర్మన్ సంజీవ్ చురివాలా.. ఆటలో మహిళా ప్రధాన్యాన్ని గుర్తించి సహాయక బృందాల్లోనూ వారికి అవకాశమివ్వడం అతి ముఖ్యమన్నారు. అన్ని క్రీడా విభాగాల్లో మహిళల భాగస్వామ్యంతో పాటు వారు సాధిస్తున్న విజయాలే నవ్‌నీతా ఎంపికకు కారణమని చెప్పారు.
ఇది చదవండి: ఏదేమైనా మా కెప్టెన్ కోహ్లీనే: జట్టు ప్రధాన కోచ్ మైక్ హెసన్