టీమిండియా కోచ్ ఎంపిక కసరత్తు పూర్తయింది. మరోసారి రవిశాస్త్రికే పదవి దక్కింది. ఆరుగురిని ఇంటర్వ్యూలకు పిలిచిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ... చివరకు రవిని కోచ్‌గా ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నాడీ మాజీ ఆటగాడు.
కోహ్లీ ఇప్పటికే రవిశాస్త్రికి బహిరంగంగానే మద్దతు తెలిపాడు. అనుకున్నట్లుగానే సీఏసీ అతడివైపే మొగ్గు చూపింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, మైక్ హెసన్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లకు నిరాశే మిగిలింది.
జట్టుతో పనిచేయడం రవిశాస్త్రికిది నాలుగోసారి. ఇంతకుముందు 2007లో బంగ్లాదేశ్ టూర్‌కు మేనేజర్‌గా, 2014-16 కాలానికి టీం డైరెక్టర్‌గా, 2017-19 (ప్రస్తుతం) హెడ్ కోచ్‌గా పనిచేశాడు.
"కోచ్ పదవి ఎంపికలో టామ్ మూడీ మూడో స్థానంలో నిలవగా, మైక్ హెసన్ రెండో స్థానంలో నిలిచాడు. రవిశాస్త్రికి మొదటి స్థానం దక్కింది. కొద్దిలో మూడీ, హెసన్లకు అవకాశం చేజారింది".
-కపిల్ దేవ్, సీఏసీ సభ్యుడు
కోచ్ పదవికి పోటీపడిన మిగిలిన వారితో పోలిస్తే రవిశాస్త్రి రికార్డు మెరుగ్గా ఉండటం అతడికి కలిసొచ్చింది. రవి భాయ్ అధ్వర్యంలో టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరింది. 71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచింది.
రవి శాస్త్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా.. 21 టెస్టులు ఆడగా 13 మ్యాచ్‌లు గెలిచింది. 36 టీ20ల్లో 25 మ్యాచ్‌లు గెలిచింది. వన్డేల్లో రికార్డు మరింత మెరుగ్గా ఉంది. మొత్తం 60 వన్డేల్లో 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. ఓ స్పష్టమైన లోటు ఆందోళన కలిగిస్తోంది. రవిశాస్త్రి డైరక్టర్‌గా 2015 ప్రపంచకప్, కోచ్‌గా 2019 వరల్డ్‌కప్.. ఇలా రెండింటిలోనూ సెమీస్ దాటలేకపోయింది టీమిండియా.
కెరీర్లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి కోచ్ పదవి ప్రపంచకప్‌తోనే ముగిసింది. అనంతరం 45 రోజుల కాలవ్యవధిని పెంచిని బీసీసీఐ.. వెస్టిండీస్ పర్యటనకు అతడికే బాధ్యతలను అప్పగించింది. వీటిలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది టీమిండియా.
ఇవీ చూడండి.. సచిన్‌ను సమం చేసిన కివీస్ బౌలర్