తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ప్రస్తుతం 697 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. అలాగే మరో ఆటగాడు కేఎల్ రాహుల్ 816 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో కలిపి భారత్ నుంచి టాప్-10లో వీరిద్దరు మాత్రమే చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ 915 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 820 పాయంట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ టాప్-10లో కొనసాగుతుండటం విశేషం. వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న ఇతడు, టెస్టుల్లో రెండో స్థానంలో నిలిచాడు.
బౌలర్ల విభాగంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో సత్తాచాటిన న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ 7వ స్థానానికి ఎగబాకాడు. వెస్టిండీస్ బౌలర్ కాట్రెల్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 736 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అదే దేశానికి చెందిన ముజిబుర్ రెహ్మన్ 730 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో అప్గనిస్థాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు షకిబుల్ హసన్ రెండో స్థానంలో ఉన్నాడు.