టెస్ట్ ఛాంపియన్ షిప్లో శుభారంభం చేద్దామనుకుంటున్న టీమిండియాకు విండీస్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మొదటి టెస్ట్ తొలి రోజే విండీస్ బౌలర్లు ధాటికి భారత టాప్ ఆర్డర్ తడబడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (44; 97బంతుల్లో 5×4), అజింక్య రహానే (81; 163 బంతుల్లో 10×4) రాణించారు.
రహానె సాయంతో భారత్ మొదటి రోజు 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనుకున్నట్లుగానే వరుణుడు ఈ మ్యాచ్‌కు కూడా ఆటంకం కలిగించాడు. ఫలితంగా తొలి రోజు ఆట 68.5 ఓవర్ల వద్దే ముగిసింది.
అంతరాయం..
టెస్టు సిరీస్ ఆరంభంలోనే వరుణుడు పలకరించాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ జరుగుతుండగా కూడా వరుణుడు రెండు సార్లు అంతరాయం కలిగించాడు. ముందుగా 47.2 ఓవర్‌లో తేలికపాటి జల్లులు కురిశాయి. అంపైర్లు తాత్కాలిక విరామం ప్రకటించారు. మళ్లీ 68.5 ఓవర్‌లో జల్లులు కురవడం వల్ల ఆటను కాసేపు నిలిపేశారు. కాసేపటికే వర్షం నిలిచినా.. వాతావరణం సహకరించడం లేదని నిర్ణీత సమయం కన్నా ముందే తొలి రోజు ఆటను నిలిపేశారు.
తడబడినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. విండీస్ ఫాస్ట్‌బౌలర్లు రోచ్, గాబ్రియెల్ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మయాంక్ (5) ఐదో ఓవర్లో రోచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడు ఔట్‌సైడ్ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్ హోప్ చేతికి చిక్కాడు. మొదట అంపైర్ ఔట్ ఇవ్వకున్నా.. విండీస్ సమీక్ష కోరి విజయవంతమైంది.
అదే ఓవర్లో పుజారా (2)ను కూడా ఔట్ చేయడం ద్వారా భారత్‌ను రోచ్ గట్టి దెబ్బతీశాడు. అప్పటికి స్కోరు 7 పరుగులే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ కోహ్లీ (9) కూడా నిలవలేకపోయాడు. బాగానే ఆరంభించినా.. గాబ్రియెల్ బౌలింగ్‌లో గల్లీలో బ్రూక్స్‌కు చిక్కాడు.
కేఎల్‌తో కలిసి..
క్రీజులోకి వచ్చిన రహానె పట్టుదలతో ఆడాడు. రాహుల్‌తో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెడుతూ వచ్చాడు. మరో వికెట్ పడకుండా లంచ్ సమయానికి భారత్ 68/3తో నిలిచింది. ఆ తర్వాత రాహుల్, రహానె ఇద్దరూ అదే పోరాటం కొనసాగించారు. భారత్ ఓ దశలో 93/3తో నిలిచింది. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుండగా చేజ్ బౌలింగ్‌లో రాహుల్ ఔట్ అయ్యాడు. 68 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
విలువైన భాగస్వామ్యం..
రాహుల్ ఔట్ అయ్యాక కూడా రహానె చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కాసేపు వరుణుడు ఆటంకం కలిగించినా టీ విరామం తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చిన ఈ జోడీ విండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది. విహారి కూడా ఆకట్టుకునే బ్యాటింగ్ చేశాడు.
అయితే 55వ ఓవర్‌లో రోచ్ బౌలింగ్‌లో అతను వికెట్‌కీపర్ షై హోప్ చేతికి చిక్కాడు. దీంతో 82 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రహానె కూడా జట్టు స్కోరు 189 పరుగుల వద్ద గాబ్రియెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. పంత్ (20), జడేజా (3) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ సాగిస్తున్న దశలో వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. ఫలితంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముందుగానే నిలిపివేశారు.
- ఇదీ చూడండి: రాజకీయ నాయకుడిగా ధోనీ.. ఫొటోలు వైరల్