ఏడాది కాలంగా నిలకడగా ఆడుతున్న యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నాడు. పరిస్థితులకు తగినట్లు ఆచితూచి ఆడటంతో పాటు అవసరమైన సమయంలో గేర్లు మార్చి విధ్వంసం సృష్టించడం అతడికి బాగానే అలవాటైంది. ఆట పట్ల తన దృక్పథం మారడానికి, పరిణతి రావడానికి కారణం రాహుల్ ద్రవిడ్ అని అతడు చెబుతున్నాడు.
"అది నాలుగు రోజుల మ్యాచ్. అప్పుడు భారత- ఎ జట్టుకు ద్రవిడ్ కోచ్. అతను నన్ను చూడడం అదే తొలిసారి. అది తొలిరోజు ఆటలో చివరి ఓవర్. నేను అప్పుడు 30 పరుగులతో క్రీజులో ఉన్నాననుకుంటా. ఆ రోజుకు అది ఆఖరి ఓవర్ కాబట్టి నేను జాగ్రత్తగా ఆడి ఆటను ముగిస్తానని అందరూ భావించారు. కానీ బౌలర్ వేసిన ఓ ఫ్లయిటెడ్ డెలివరీని అమాంతం గాల్లోకి లేపా. అది చాలా ఎత్తుకు వెళ్లి స్టాండ్స్‌లో పడింది. డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి అందరూ బయటకు పరుగెత్తుతూ వచ్చారు. చివరి ఓవర్లో ఎవరైనా అలా సిక్సర్ కొడతారా అని మాట్లాడుకున్నారు. అప్పుడు ద్రవిడ్ నా దగ్గరికి వచ్చి కొంచెం కోపంగా.. 'ఏమిటిది? చివరి ఓవర్లో ఇలా చేస్తావా?' అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడు అలా ఎందుకు అన్నాడో అర్థమైంది" అని అయ్యర్ చెప్పాడు.
ఇదీ చూడండి.. ఈరోజు: ధనాధన్ ధోనీ తొలి సెంచరీకి 15 ఏళ్లు