ఇంగ్లాండ్‌తో తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టీమ్‌ఇండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ.. తన పేస్, బౌన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కొత్త బంతితో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు వన్డేల్లోనూ బంతి కాస్త పాతబడ్డాక తన రెండో స్పెల్‌లోనే అతను వికెట్లు రాబట్టాడు.
"వ్యక్తిగతంగా బౌలింగ్‌ను మెరుగ్గా ఆరంభించేందుకే ఇష్టపడతా. కొత్తబంతితో మరింత ఉత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. లయ తప్పిన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సమర్పించుకున్నా. కాబట్టి ఆ విషయంలో మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తా" అని ప్రసిద్ధ్ చెప్పాడు.
రెండో వన్డేలో బెయిర్‌స్టో, స్టోక్స్ కలిసి తమ బౌలింగ్‌పై దాడి చేశారని ప్రసిద్ధ్ అన్నాడు. "గత మ్యాచ్‌లో మేం మరింత గొప్పగా బౌలింగ్ చేయాల్సిందనేది కాదనలేని నిజం. అయితే బెయిర్‌స్టో, స్టోక్స్ బ్యాటింగ్‌కు ఘనత చెందుతుంది. మా బౌలింగ్‌ను వాళ్లు చితక్కొట్టారు. ఇలాంటి పిచ్‌పై 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండడం వల్ల బ్యాట్స్‌మెన్‌ను ఆపడం సాధ్యం కాదు. పరిమిత ఓవర్ల క్రికెట్ అంటే అంతే. ఈ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంది. మేం 330కి పైగా పరుగులు చేసినా.. ఇంగ్లాండ్ 44వ ఓవర్లోనే దాన్ని ఛేదించడం అందుకు నిదర్శనం" అని అతను చెప్పాడు.