సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ రద్దయిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని అంటోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.
సమాచారం లేదు
ఆసియా కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏసీసీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని పీసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇదే విషయంపై పీసీబీ చీఫ్ ఎహ్సాన్ మణి స్పందిస్తూ.. "ఆసియా క్రికెట్ మండలి ఆసియా కప్‌ను నిర్వహిస్తుందని మేమంతా ఎదురుచూస్తున్నాం. వారు (భారత్) కొన్ని విషయాల గురించి ఆరా తీస్తున్నారు. బహుశా గంగూలీకి తెలిసిన విషయం నాకు తెలియకపోవచ్చు. కానీ, టోర్నీ రద్దుపై ఏసీసీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు" అని ఎహ్సాన్ మణి తెలిపినట్లు ఓ పత్రికా విలేకరి వెల్లడించారు. ఆసియా కప్ నిర్వహణ విషయంపై ఏసీసీ ఛైర్మన్ నజ్ముల్ హసన్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.
ఆసియా కప్ రద్దు
ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీ రద్దుకు నిర్ణయించామని తాజాగా ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.